మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వోల్వో బస్సు డీజిల్ ట్యాంకు పగిలి కాలిపోవడంతో అందులో ఉన్న దాదాపు 40 మంది ప్రయాణికులు మరణించినట్లు భావిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సుగా దీన్ని గుర్తించారు. ఈ సంఘటన కొత్తకోట ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 4-5 గంటల మధ్య జరిగింది. వోల్వో బస్సు ఒక కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో బాగా కుడి వైపునకు వెళ్లడం, దాంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయని అంటున్నారు. ఏసీ బస్సు కావడంతో లోపల ఉన్న ఫాబ్రికేషన్ మెటీరియల్, ఏసీలో ఉండే గ్యాస్, కర్టెన్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. నలుగురు మాత్రం సురక్షితంగా బయటకు దూకారు. మిగిలిన ప్రయాణికులంతా మరణించారనే భావిస్తున్నారు. కనీసం బస్సు డ్రైవర్ కూడా కిందకి దిగలేని పరిస్థితి ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలోనే ఇంత ఘోర ప్రమాదం ఎప్పుడూ జరగలేదని అంటున్నారు.