ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్ల పాటు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు విరమణ ప్రయోజనాల చెల్లింపులు ఆర్థికంగా భారంగా మారటంతో సర్కారు ఈ దిశగా మొగ్గుచూపుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుకు 58 ఏళ్ల గరిష్ట వయో పరిమితి అమల్లో ఉంది. రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ ఉద్యోగుల పదవీ కాల పరిమితిని 60 ఏళ్లకు పెంచింది. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ రెండేళ్ల వెసులుబాటు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు పదో పీఆర్‌సీ అమల్లోకి వచ్చినప్పట్నుంచి రిటైరయ్యే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రయోజనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఖజానాపై ఆర్థిక భారం పెరిగిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో 3.50 లక్షల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లోగా 60 వేల మంది ఉద్యోగులు రిటైరవుతారని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 1.20 లక్షలకు చేరుతుందని ప్రభుత్వ వర్గాలు లెక్కలేస్తున్నాయి. రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లించే ప్రయో జనాలకు ఏటా దాదాపు రూ. 5 వేల కోట్లు కావాలి. ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.