అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఈ నియోజకవర్గ పరిధిలోని కనగానపల్లి మండల పరిషత్ అధ్యక్ష స్థానానికి బుధవారం నిర్వహించిన ఎన్నికలో స్వయాన మంత్రే దౌర్జన్యానికి దిగారు. పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. అనుచరులతో కలసి ఎన్నిక జరిగే ఎంపీడీవో కార్యాలయం వద్ద మోహరించిన మంత్రి భయాందోళనలకు గురిచేశారు. ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను ‘మీరు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకుంటే ప్రాణాలతో బయటకు వెళ్లలేరు. ఇక్కడ మా పార్టీ అనుచరులు ఐదు వేల మంది ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తే బయటకు వెళ్లగానే చంపుతారు..’ అంటూ మంత్రి బెదిరించినట్లు సభ్యులు చెప్పారు. ఎన్నిక సమయంలోనూ వైఎస్సార్‌సీపీ సభ్యులపై అధికార టీడీపీ సభ్యులు దాడి చేశారు.