26/11 సూత్రధారి లఖ్వీకి బెయిల్ | pak-wont-learn-bails-26-11-butcher-zakiur-rehman-lakhvi | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 29 2014 5:15 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

26/11 ముంబై దాడుల సూత్రధారి, నిషేధిత లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రెహ్మన్ లఖ్వీకి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదాన్ని ఈ ప్రాంతం నుంచే తరిమేద్దామని, పాక్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిద్దామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చిన మర్నాడే లఖ్వీ జైలు నుంచి విడుదలవ్వడం విశేషం. ‘ఈ నిర్ణయాన్ని మేం ఊహించలేదు. బెయిల్ మంజూరు కన్నా ముందే మరిన్ని సాక్ష్యా లను మేం కోర్టుకు హాజరుపరిస్తే బావుండేది’ అని ప్రాసిక్యూషన్ చీఫ్ చౌధ్రీ అజహర్ అన్నారు. లఖ్వీపై సాక్ష్యాధారాలు బలంగా లేనందువల్ల ఆయనకు బెయిల్ మంజూరైందని లఖ్వీ తరఫు న్యాయవాది రాజా రిజ్వాన్ అబ్బాసీ తెలిపారు. 26/11 కేసుకు సంబంధించిన మరో ఆరుగురు నిందితులకు కూడా బెయిల్ కోరుతూ త్వరలో కోర్టులో దరఖాస్తు చేస్తామన్నారు. భద్రతాకారణాల వల్ల ఈ కేసును రావల్పిండిలోని అడియాల జైల్లో రహస్యంగా విచారిస్తున్నారు. 2008లో ముంబైపై దాడి జరగగా, 2009 నవంబర్‌లో ప్రారంభమైన ఈ కేసు విచారణ వరుస వాయిదాలు, సాంకేతిక కారణాలతో నత్తనడకన నడుస్తోంది. లఖ్వీకి బెయిల్ మంజూరవడంపై భారత్ తీవ్రంగా స్పందించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement