పై-లిన్ తుపాను ప్రభావంతో ఒడిశా గడగడ వణికిపోతోంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం సహాయక చర్యలపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఒడిషాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భువనేశ్వర్ పూర్తిగా తడిచి ముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తుపాను తీరం దాటనుంది. ప్రస్తుతం 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పై-లీన్ తుపాను వల్ల ప్రాణనష్టం సాధ్యమైనంత తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ఒడిశా సర్కారు చర్యలు చేపట్టింది. తుపాను తీవ్ర ప్రభావం చూపే 7 కోస్తా జిల్లాల్లో దాదాపు 5 లక్షల మందిని ఖాళీ చేయిస్తోంది. గంజాం, గజపతి, పూరి, ఖుద్రా, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపర, నయాగఢ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ప్రభుత్వం భద్రక్, బాలాసోర్ జిల్లాలనూ అప్రమత్తం చేసింది. తుపాను నేపథ్యంలో వాయుసేనకు చెందిన 2 ఐఎల్-76 విమానాల్లో విపత్తు సహాయ దళం బృందాలు, పరికరాలను అధికారులు భువనేశ్వర్ తరలించారు. రాయ్‌పూర్, నాగ్‌పూర్, జగ్దల్‌పూర్, బారక్‌పూర్, రాంచి, గ్వాలియర్ తదితర వైమానిక స్థావరాల్లో వైమానిక బలగాలను సిద్దంగా ఉంచారు. తుపాను తీరాన్ని తాకగానే సహాయ, రక్షణ చర్యలు చేపట్టడానికి 28 ఎన్‌డీఆర్ఎప్ దళాలను అందుబాటులో ఉంచారు. అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.మరోవైపు ఏ క్షణంలో ముప్పు ముంచుకు వస్తుందోననే ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తీర ప్రాంత జిల్లాల ప్రజలు ప్రమాదం ఎప్పుడు దాటిపోతుందా అని క్షణమొక యుగంలా కాలం గడుపుతున్నారు.
Oct 12 2013 12:11 PM | Updated on Mar 21 2024 8:50 PM
Advertisement
Advertisement
Advertisement
