ఒకటో తారీఖు వచ్చేసింది.. ఇక కరెన్సీ కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి! గురువారం పరిస్థితి ఎలా ఉంటుందోనని హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోని బ్యాంక్ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోని చాలా వరకు బ్యాంక్ శాఖల్లో నగదు లేదు. అక్కడక్కడ ఎస్‌బీఐ బ్రాంచీలకు రిజర్వుబ్యాంక్ నుంచి కొంత నగదు అందుతున్నా.. అది మొదటి గంటలో వచ్చే ఖాతాదారులకే సరిపోతోంది. అదీ ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే అందించగలుగుతున్నారు. మిగిలిన అన్ని బ్యాంక్‌ల శాఖలు నో క్యాష్ బోర్డులు తగిలిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో 1,526 బ్యాంక్ శాఖలు ఉండగా బుధవారం 1,100 శాఖల నుంచి ఖాతాదారులకు పైసా కూడా అందలేదు.