ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రైతు తన ఉత్పత్తులను అమ్ముకోలేని స్థితికి చేరడానికి బాబే కారణమని జగన్ విమర్శించారు. రైతులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాల్సి వస్తుందని వారి ఆత్మహత్మలను బాబు ఒప్పుకునే స్థితిలో లేడని ఎద్దేవా చేశారు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేస్తున్నా.. చంద్రబాబు నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోవడం నిజంగా సిగ్గు చేటన్నారు. రైతులు తీవ్ర కరువులో కూడా రూ. 2, 3 వడ్డీకి అప్పు తెచ్చుకుంటారన్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు ఇవ్వాల్సి వస్తుందని రకరకాల కార్డుల లింక్ పెట్టిన ఘనత ఏపీ సీఎందేనని అన్నారు. ఆదివారం నిరాహార దీక్షను ముగించిన అనంతరం రైతులు, డ్వాక్రా మహిళలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. తొలుత ఒక ఆధార్ కార్డు ఉంటేనే రుణమాఫీ అంటూ చెప్పిన బాబు.. తరువాత రేషన్ కార్డు ఉండాలని.. ఒక ఖాతాకు మాత్రమేనని.. అటు తరువాత గ్రామంలో ఉన్న వారికి మాత్రమేనని అంటూ బాబు రకరకాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేశాడన్నారు. చివరకు పొట్ట కూటి కోసం హైదరాబాద్ కు వెళ్లిన రైతులను అసలు రైతులే కాదంటూ బాబు దాటవేత ధోరణి అవలంభిచడన్నారు. హైదరాబాద్ లో ఆధార్ కార్డు ఉంటే వారు అసలు రైతులు కాదనడం ఎంత వరకూ సమంజమని జగన్ ప్రశ్నించారు. మరి చంద్రబాబుకి పాన్ కార్డుతో సహా అన్ని కార్డులు హైదరాబాద్ లో ఉన్నా ఆయన ఏపీకి సీఎం కాలేదా? అని జగన్ నిలదీశారు.రైతులకు ఒక మాట.. ఆయనకొచ్చేసరికి మరోమాట మాట్లాడే నైజం చంద్రబాబుదన్న విషయం బహిర్గతమైందన్నారు.