రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం నుంచే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ప్రారంభించారు. ఉదయం టీ గానీ, అల్పాహారం గానీ ఆయన ముట్టుకోలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో చంచల్గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందువల్ల వారిని నియంత్రించేందుకు ఈ బందోబస్తు ఏర్పాటైంది. ఇరుప్రాంతాలకూ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే డిమాండ్‌తో ఆయన జైలులోనే దీక్ష ప్రారంభించారు. కొణతాల, భూమా నాగిరెడ్డి తదితరులు శనివారం చంచల్గూడ జైల్లో ములాఖత్ ద్వారా జగన్‌ను కలిసి వచ్చిన అనంతరం విలేకరుల సమావేశంతో తమ పార్టీ అధినేత నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలపై జగన్ ఆవేదనను, ఆందోళనను వీరు ఒక ప్రకటన రూపంలో మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు జగన్ మాటల్లోనే... స్పందించకపోతే రాష్ట్రం ఎడారి అవుతుంది... ‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు తెలుగుదేశం పార్టీని ఎందుకు ఆలోచింపజేయలేకపోతున్నాయని చాలా బాధగా ఉంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసిన తీరు పట్ల ఆవేదనగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇంత కీలక సమయంలో వారి ఓట్లు, సీట్ల కోసం మౌనం వహించటం, అవకాశవాద రాజకీయాలు చేస్తుండటం బాధ కలిగిస్తోంది. స్పందించవలసిన ఈ సమయంలో మనం స్పందించకపోతే ఈ రాష్ట్రం ఏడారి అవుతుంది. కాబట్టి రేపటి నుంచి (ఆదివారం) జైలులోనే నేను నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నా. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోరాం... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున కేంద్ర హోంమంత్రికి మనం ముందే ఒక లేఖ రాశాం. మీరు తీసుకునే నిర్ణయంలో ఏదన్నా తేడా ఉంటే కోట్ల మందికి అన్యాయం జరుగుతుంది. మీ నిర్ణయానికి ముందు మీ వైఖరి ఇది అని చెప్పి, తరువాత కేంద్రం తరఫున అందరినీ పిలవండి. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కారం ఇవ్వండి అని పార్టీ తరఫున చెప్పటం జరిగింది. అయినా లాభం లేకపోయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీయేల నిరంకుశ నిర్ణయంతో అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతోనే మొత్తంగా పార్టీ ఎమ్మెల్యేలు అందుకు ఐదు రోజుల ముందే రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ వారికి ఇక్కడి ప్రజల ఆక్రందనల్ని ముందుగానే వినిపించి మనసు మార్చే ఉద్దేశంతో మన ఎమ్మెల్యేల రాజీనామాతో పాటు రాసిన లేఖలో కోట్ల మందికి జరగబోతున్న అన్యాయం గురించి వివరించటం జరిగింది. కొంచెం అయినా ఆ మాటలు వినిపించుకుంటారని ఆశపడ్డాం. అయినా అదంతా అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇవన్నీ అన్యాయంగా కనిపిస్తూ ఉన్నా ఓట్లు, సీట్లు, క్రెడిట్ దక్కవేమో అని ఆరాటపడుతున్న వీరందరినీ చూసి ఏమనుకోవాలి? ఈ రోజున రాష్ట్రంలో కోట్లాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. వారి బాధ ఏమిటి.. ఎందుకీ ఆక్రందనలు.. అని తెలుసుకునే ప్రయత్నంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవటాన్ని మనం గమనిస్తున్నాం. వారు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో చూడండి.. ప్రభుత్వ కమిటీ వేసి, సీమాంధ్ర ప్రజల వాదన వినేందుకు ప్రయత్నించకపోగా విభజన తమ సొంత వ్యవహారం అన్నట్లు పార్టీ కమిటీ వేశారు. ఆ కమిటీ వారికి, మన రాష్ట్రం వచ్చి ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే సమయం లేదట. ఇక్కడి వారే కావాలంటే ఢిల్లీకి రండి అనటం వింటుంటే గుండె చివుక్కుమంటోంది. వారి వెటకారం చూస్తే.. పార్టీ కమిటీ ఎలా న్యాయం చేయగలుగుతుందన్న కనీస ఆలోచన కూడా లేకుండా వారు మాట్లాడుతున్నారు. ప్రజల ఆక్రందనలతో వారి మనసు కరగలేదు... పార్టీ గౌరవాధ్యక్షురాలు, నేను రాజీనామా చేశాం. ప్రధానికి ఉత్తరం రాశాం. అన్యాయాన్ని ఆపండి అని. చివరికి గౌరవాధ్యక్షురాలు ఆమరణ దీక్షకు కూర్చున్నా వారి మనసు కరగలేదు. ఇన్ని కోట్ల ప్రజల ఆక్రందనలు వారి హృదయాలను కదిలించటం లేదు. కాంగ్రెస్ వారు చివరికి వారి నియంతృత్వ పోకడలకు కొనసాగింపుగా విజయమ్మ ఆమరణ దీక్షను కూడా భగ్నం చేశారు. స్పందించాల్సిన ఈ సమయంలో స్పందించకపోతే ఈ రాష్ట్రం ఎడారి అయిపోతుంది. అందుకే ఆదివారం నుంచి నేను నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నా’’ అంటూ జగన్ ఆవేదనతో తమకు వెల్లడించినట్లు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణ, భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై జగన్ మరో పోరాటానికి సిద్ధమవుతున్నారని.. జనంలో ఉన్నా, అక్రమ కేసుల వల్ల జైల్లో ఉన్నా జగన్ జన నేతే అని ఈ దీక్ష ప్రకటనతో మరోసారి నిరూపణ అవుతోందని పేర్కొన్నారు. త్వరలో షర్మిల బస్సుయాత్ర కూడా ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ప్రతిపక్ష నేత స్పందించకపోవటం దారుణం... అన్ని ప్రాంతాల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం సీట్లూ, ఓట్లూ లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోబోతోందని స్పష్టంగా తెలిసినా.. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబునాయుడు స్పందించకపోవటం దారుణం. ముఖ్యంగా చంద్రబాబు రాష్ట్ర విభజన కోసం బ్లాంక్ చెక్‌లా తాను ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోకపోవటం, తాను రాజీనామా చేయకపోవటం, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు అందరిచేతా జూలై 25న గానీ, ఆ తరువాత గానీ రాజీనామాలు చేయాల్సిందిగా అడగకపోవటం.. కాంగ్రెస్ ప్రకటించిన విధంగా విభజిస్తే సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఏపీఎన్జీవోలు ప్రాధేయపడుతూ, లేఖను వెనక్కు తీసుకోండని అడిగినా కనీస కనికరం కూడా చూపించకుండా ఆ లేఖను వెనక్కి తీసుకోనని చంద్రబాబు తెగేసి చెప్పటం... ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాంగ్రెస్ వారు సీమాంధ్రకు అన్యాయం చేస్తుంటే ఆ ఓట్లు తనకూ పోతాయని, ఆ సీట్లు తనకు రావని, ఆ క్రెడిట్ తనకు దక్కదేమో అని కోట్ల ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా స్పందించకపోవటం చాలా బాధ కలిగిస్తోంది. అసలు చంద్రబాబు తాను, తన ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. ఈ అన్యాయాలు వారికి ఎందుకు కనపడటం లేదు? రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడే.. కృష్ణా నీరు మహారాష్ట్ర అవసరాలు తీరిన తరువాత గానీ, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప కిందికి వదలని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్నే చీల్చి మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్ళు ఎలా వస్తాయి? ఆ తర్వాత నాగార్జునసాగర్‌కు నీళ్ళు ఎలా వస్తాయి? దిగువ రాష్ట్రం కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రం నీళ్ళు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి? కృష్ణా ఆయకట్టులో రోజూ రైతులు తమలో తాము కొట్టుకునే పరిస్థితి రాదా? పోలవరానికి జాతీయ హోదా అని అంటున్నారు. కానీ రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? రాష్ట్ర ప్రజలందరూ 60 ఏళ్ళు కలిసి కట్టుకున్న హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపొమ్మంటున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 50 శాతం నిధులు ఒక్క హైదరాబాద్ నుంచే వస్తున్న పరిస్థితుల్లో ఈ నిధులే రాకపోతే ఉద్యోగులకు జీతాలు ఎలా ఇవ్వగలరు? అవ్వ, తాతల పింఛన్ ఎలా ఇవ్వగలరు? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ హైదరాబాద్ లేకుండా పోతే చదువుకున్న ప్రతి పిల్లవాడు ఉద్యోగం కోసం ఎక్కడికి పోవాలి? హైదరాబాద్‌లోని సీమాంధ్రులు, ఇప్పటికే ఇక్కడ స్థిరపడిన వారి పరిస్థితి ఏంటి? ఇవన్నీ కాంగ్రెస్ వారికి, తెలుగుదేశం వారికి ఎందుకు కనపడటం లేదు?