తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు జె. శేఖర్‌రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు గురువారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ నలుగురూ వ్యాపార భాగస్వాములని తెలిసింది. మొత్తం రూ.90 కోట్ల నగదు, కడ్డీల రూపంలో ఉన్న 100 కిలోల బంగారం, అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల విలువ రూ.400 కోట్లుగా లెక్కకట్టినట్లు సమాచారం. పట్టుబడిన రూ.90 కోట్ల నగదులో రూ.70 కోట్లు కొత్త రూ.2వేల నోట్లని తెలిసింది. ప్రేమ్ రెడ్డి అనే వ్యక్తి నగదుకు బంగారు కడ్డీలు మార్పిడి చేస్తున్నట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం నేపథ్యంలో.. 60 మంది ఐటీ అధికారుల బృందం గురువారం ఉదయం ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు ప్రారంభించింది.