సింగరేణి కార్మికులకు శుభవార్త. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి బోర్డు అంగీకరించింది. ప్రస్తుతం పనిచేస్తున్న సింగరేణి కార్మికుల్లో గత దసరా నాటికి అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సదరు ఉద్యోగి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామనే నిబంధన విధించింది. దీంతో సింగరేణివ్యాప్తంగా దాదాపు 18 వేల మంది కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తు న్నారు.