పై-లీన్ తుఫాను ధాటికి శ్రీకాకుళం ప్రాంతం అతలాకుతలమైంది. దీన్ని పునర్నిర్మించుకోడానికి మత్స్యకారులు తమంతట తాము ముందుకొస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో దాదాపుగా గంటకు 220-240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలో ఏకంగా 832 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. వాటిని పునరుద్ధరించడం విద్యత్ శాఖ ఉద్యోగులకు తలకు మించిన భారంగా మారిపోయింది. పై-లీన్ ధాటికి కాజ్వే కొట్టుకుపోవడంతో కవిటి మండలం కళింగపట్నం, ఒంటూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ కారణంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆయా ప్రాంతాలకు చేరుకోవడం కూడా అసాధ్యం అయిపోయింది. దాంతో.. మత్స్యకారులు స్పందించారు. తమంతట తాముగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కవిటి మండలం కళింగపట్నం లాంటి గ్రామాల్లో వాళ్లే విద్యుత్ లైన్లను పునరుద్ధరించుకుంటున్నారు. పోల్స్ ఎత్తడం, వైర్లు కట్టడం అన్నీ తామే చేసుకుంటున్నామని చెప్పారు. శ్రమదానంతో తాము అన్నీ చేసుకుంటున్నట్లు గ్రామ సర్పంచి తెలిపారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగా పనులు చేసుకుంటున్న మత్స్యకారులను అధికారులు అభినందించారు.
Oct 15 2013 12:23 PM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
Advertisement
