టీడీపీ ఎంపీల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు లేదని మచిలీపట్నం ఎంపీ కొనగళ్ల నారాయణరావు అన్నారు. తమకు పవన్ కల్యాణ్ ప్రశంసలు అవసరం లేదన్నారు. విజయవాడలో మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.. తమ పనితీరు గురించి ప్రజలు అడగాలి లేదా తమ అధినేతను అడగాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ఎప్పుడో ఒకప్పుడు మైక్ ముందుకు వచ్చి నోటికి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ లా తిట్టలేకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు సత్తా చూపిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటిస్తున్నామన్నారు. బూతులు తిట్టుకోవడంలో పోటీ పడాల్సిన అవసరం లేదన్నారు.