బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్న లెక్కల్లోలేని డబ్బుపై 60 శాతం ఆదాయపు పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నోట్లరద్దు తర్వాతి పరిణామాలపై చర్చించారు. జన్‌ధన్ అకౌంట్లలో రూ.21వేల కోట్లకు పైగా డబ్బులు చేరినట్లు వెల్లడైన నేపథ్యంలో అత్యవసరంగా జరిగిన ఈ భేటీ ఆసక్తిగా మారింది. కేబినెట్ భేటీ సమావేశం వివరాలను వెల్లడించనప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం లెక్కల్లోలేని డబ్బును డిపాజిట్ చేస్తే దానిపై 60 శాతం ఆదాయపు పన్ను విధించటంపై చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వం నోట్లరద్దుపై ప్రకటన చేసినప్పటినుంచీ.. పలుమార్లు చేసిన అధికారిక ప్రకటనల వల్ల పన్ను చెల్లించని వారిపై తీవ్ర పరిణామాలు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి. 30 శాతం ఐటీకి తోడు అదనంగా 200 శాతం పన్ను విధించొచ్చని కొందరు అధికారులు వెల్లడించారు. కానీ, దీనికి ఐటీ చట్టం వీలు కల్పించటం లేదు.