హుదూద్ సహాయార్థం టాలీవుడ్ 'మేము సైతం' | tollywood-gearup-to-raise-funds-for-hudhud-victims | Sakshi
Sakshi News home page

Nov 19 2014 8:30 PM | Updated on Mar 20 2024 3:19 PM

హుదూద్ తుపాను బాధితులను ఆదుకోడానికి 'మేము సైతం' అనే భారీ కార్యక్రమాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ చేపడుతోంది. ఈనెల 29, 30 తేదీలలో ఈ బృహత్ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్ ప్రముఖులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇది కేవలం ఆ రెండు రోజులకు మాత్రమే పరిమితం కాదని, మారథాన్లా సాగుతుందని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తెలిపారు. 29వ తేదీ రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు నటీనటులతో డిన్నర్ కార్యక్రమం ఉంటుందని నాగార్జున చెప్పారు. దానిలోకి కేవలం 250 జంటలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో జంటకు టికెట్ ధరను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. జంటలు అంటే.. భార్యాభర్తలు కావచ్చు, అన్నాదమ్ములు కావచ్చు, ఎవరైనా ఇద్దరి చొప్పున రావాలని తెలిపారు. ఎవరికీ కాంప్లిమెంటరీ పాస్లు మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే మొదటి టికెట్ను అల్లు అరవింద్ కొన్నారు. పలు రకాల కార్యక్రమాలు ఉంటాయని, 500 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వివిధ రకాల కార్యక్రమాలకు వివిధ ధరల్లో టికెట్లు నిర్ణయించారు. ఆటలు, పాటలు, డాన్సులు, వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయన్నారు. వీటన్నింటికి సంబంధించిన టికెట్లను బుక్ మై షో ద్వారా కూడా పొందొచ్చన్నారు. అలాగే సికింద్రాబాద్ క్లబ్బు, ఫిల్మ్నగర్ క్లబ్బు లాంటి చోట్ల కూడా దొరుకుతాయన్నారు. ఇతర వివరాలకు memusaitam.com అనే వెబ్సైట్లో కూడా సంప్రదించవచ్చని వివరించారు. ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, శ్రీకాంత్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అశోక్ కుమార్, ఇతర టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement