బంగారం, వెండి ధరలు మళ్లీ తిరోగమన బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర గత రెండు రోజుల్లో 50 డాలర్లు పతనమైంది. ప్రస్తుతం 1311 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నెల రోజులుగా చూస్తే ఔన్స్ ధర 1400 డాలర్ల స్థాయి నుంచి 1300 డాలర్లకు వచ్చింది. అదే సమయంలో మన మార్కెట్లో రూపాయి కూడా కొంత కోలుకోవడంతో 10 గ్రాముల బంగారం ధర దిగొచ్చింది. ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 5 వేల రూపాయలు తగ్గింది. 34,500ల దాకా వెళ్లి.. జీవిత కాల గరిష్ఠ స్థాయిని తాకిన ధర.. ఇప్పుడు 30 వేల రూపాయల లోపు ట్రేడవుతోంది. గడిచిన రెండు రోజుల్లో ఎంసీక్స్లో ధర 1000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 300 రూపాయల దాకా తగ్గుతూ 29,760 రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్.. స్టిమ్యులస్ ప్యాకేజీలను ఉపసంహరించుకోవడం ఖాయమనే వార్తలతో బంగారం ధర దిగొస్తోంది. వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి కేజీ వెండి ధర దాదాపు 10 వేల రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఎంసీక్స్లో కేజీ వెండి ధర 600 రూపాయల దాకా నష్టపోతూ 49,900ల రూపాయలకు సమీపంలో ట్రేడవుతోంది.