
పెరియ పురాణం ద్వారా వెలుగులోకి జన్మస్థలి
పట్టించుకోని ప్రభుత్వం
కన్నెత్తి చూడని శ్రీకాళహస్తి దేవస్థానం
భక్తుల ఆవేదన అరణ్య రోదన
భక్తకన్నప్ప జన్మస్థలికి ఇప్పటి వరకు అధికార ముద్ర పడలేదు. కూటమి ప్రభుత్వం అయినా చొరవ చూపుతుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భక్తకన్నప్ప సినిమా తీస్తున్న మంచువిష్ణు బృందం సందర్శించిన క్రమంలో.. ఊటుకూరు మరోసారి తెరపైకి వచ్చింది.
రాజంపేట : భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు. తెలుగు వాడు. ఆయనను మొదట్లో తిన్నడు అనే పేరుతో పిలిచే వారు. బోయ వంశస్తుడు. ఒక బోయరాజు కుమారుడు.ఒకనాడు అడవిదారి గుండా వెళ్తుండగా.. శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని తిన్నడు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ.. తాను వేటాడి తెచ్చిన మాంసాన్నే నైవేద్యంగా సమర్పించే వాడు. ఒక సారి శివుడు తిన్నడు భక్తిని పరీక్షించ దలచి.. ఆయన పూజ చేయడానికి వచ్చినపుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెట్టారు. విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి విగ్రహానికి అమర్చాడు. వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది.
కాలి బొటనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు. తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించారు. నిన్ను దర్శించినా, చరిత్ర విన్నా.. పఠించినా సర్వపాపాలు తొలిగి.. అంత్యకాలంలో కై లాసప్రాప్తి పొందుతారని పలికి పరమశివుడు అంతర్థానమయ్యారు. అందువల్లనే తిన్నడికి.. కన్నప్ప అనే పేరు వచ్చింది. తిన్నడు దేవుడికి కన్ను ఇచ్చినందుకే కన్నప్ప అయ్యారు. ఆయన భక్తిని మెచ్చిన ప్రజలు.. భక్తకన్నప్పగా పిలుస్తున్నారు. ఆ శివలింగం ఉన్న ప్రాంతంలోనే శ్రీ కాళహస్తి క్షేత్రం వెలసినట్లు చరిత్ర చెబుతోంది.
కన్నప్ప పుట్టిన ఊరు ఎక్కడా..
రాజంపేట పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో కడప–రేణిగుంట జాతీయ రహదరిలో భక్తకన్నప్ప జన్మస్థలం అయిన ఊటుకూరు ఉంది. హైవే రోడ్డు పక్కనే కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం ఉన్న పురాతన ఆలయం ఉంది. తిరుపతి, చైన్నెకు వెళ్లే ఏ వాహనంలో అయినా ఊటుకూరు (ఉడుమూరు)కు చేరుకోవచ్చు.
వెలుగులోకి తీసుకొచ్చిన తమిళ వాసి..
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన పళనిస్వామి పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం.. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి విదితమే. అప్పటి నుంచి గ్రామస్తులు దాతల సహకారంతో.. గ్రామంలోని శివాలయం అభివృద్ధికి నడుంబిగించారు. భక్తకన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూపులు
భక్తకన్నప్ప జన్మస్థలం అధికారిక గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనమతులు ఎప్పుడు వస్తాయని ఇక్కడి ప్రాంతీయులు వేచి చూస్తున్నారు. భక్తకన్నప్ప జన్మస్థలం అభివృద్ధికి సహకరించాలని గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం దృష్టికి వారు తీసుకెళ్లారు.
అన్నమయ్యతో కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం
తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. ‘శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనవునిగా పుడతారు’ అని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభాస్యం చేశాడు. కలియుగ దైవం వెంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలు రచించి, పద కవితా పితామహడుపేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది.
కన్నప్ప.. కాళహస్తికి ఎలా వెళ్లాడు
తిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖినది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారారు. తర్వాత తన రెండు కళ్లను సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఆనాటి నుంచి శ్రీకాళహస్తిలో భక్తకన్నప్పకు.. స్వామివారి కన్న ముందే పూజ చేయడం ఆచారంగా వస్తోంది. ఏటా స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ.. భక్తకన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణ చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు.
కన్నప్ప జన్మస్థలం ఇలా..
అరవై ముగ్గురు మహాశివభక్తులలో కన్నప్ప ఒకరు. తండ్రి నాగుడు, తల్లి తంచె. కన్నప్ప ద్వాపరయుగంలో అర్జునడే. ఆ యుగంలో శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి.. పాశుపాతాస్త్రం పొందారు. కలియుగంలో తిన్నడు (కన్నప్ప)గా ఉడుమూరులో జన్మించారు. కాలక్రమంలో ఉడుమూరు ఊటుకూరుగా మారింది. కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం.. తన జన్మస్థలమైన ఊటుకూరులో ఉంది. అక్కడ శివాలయం వెలసింది.
భక్తకన్నప్ప నడయాడిన ప్రదేశం
గామంలో కన్నప్ప పూజించిన శివాలయం ఉంది. అలాగే ఊటుకూరు పరిసరాలు కన్నప్ప నడయాడిన ప్రాంతాలు. భక్తకన్నప్పకు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ అనే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది.
–నాగా ఫృథ్వీపతిరెడ్డి,గ్రామపెద్ద, ఊటుకూరు
చారిత్రక ఆధారాలు ఉన్నాయి
కన్నప్ప ఇక్కడి వాడేనని అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తికి అటవీ మార్గంలో చేరుకున్నారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో తొలిపూజ మా గ్రామానికి చెందిన భక్తకన్నప్పకు అంటే మాలో ఎక్కడ లేని భక్తి ఉప్పొంగి వస్తుంది.
–ఆర్.శ్రీనువాసురాజు, ఎంపీటీసీ, ఊటుకూరు