వరాల దేవత.. వాసవీ మాత | - | Sakshi
Sakshi News home page

వరాల దేవత.. వాసవీ మాత

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

వైభవంగా 136వ దసరా ఉత్సవాలు

● కోరిన కోర్కెలు తీర్చే తల్లి

శ్రీ కన్యకా పరమేశ్వరిదేవి

● అమ్మవారిశాలలో కమనీయంగా

దేవీశరన్నవరాత్రులు

● ఉత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు

ఆలయ గోపురం

ప్రొద్దుటూరు కల్చరల్‌ : దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంలో రెండో మైసూరుగా ప్రొద్దుటూరు పట్టణం పేరు గాంచింది. ఇక్కడ జరిగే దేవీశరన్నవ రాత్రి వేడుకలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన భక్తులు పట్టణానికి చేరుకుంటారు. పుత్తడిపురంగా పేరొందిన ప్రొద్దుటూరు అంటే గుర్తుకు వచ్చేది శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయం. ఈ ఆలయంలో నిర్వహించే దసరా వేడుకలు ప్రఖ్యాతి గాంచాయి. ఆదివారం వైభవంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు 21వ తేదీ వరకు ఆర్యవైశ్య సభ సహకారంతో దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహిస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని శ్రీవాసవీ మాత కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. అమ్మవారిశాలను 1890లో నిర్మించారు. ఈ ఆలయం ఎత్తయిన గాలి గోపురం కలిగి, చక్కని శిల్ప కళా నైపుణ్యంతో పట్టణానికి శోభ చేకూర్చే విధంగా ఉంది. అపురూపమైన శిల్ప సంపద కలిగిన ఆలయ ముఖ ద్వార మండపం మనోహరమైన దృశ్యాల సమ్మేళనం. 1895 నుంచి దసరా ఉత్సవాలను ఆర్యవైశ్య సభవారు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో విజయదశమినాడు నిర్వహించే శమీదర్శన గ్రామోత్సవం, అర్ధరాత్రి తొట్టి మెరవణి(పంచలోహరథం) అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రోజూ ప్రత్యేక పూజలు

వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి రోజూ విశేష అభిషేకాలు, అర్చనలతోపాటు వాసవీ నిత్యహోమాన్ని లోకకల్యాణార్థం పండితులు చేస్తుంటారు. పట్టణంలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారికి ఏ ఆలయంలో లేని విధంగా పుత్తడి ఆభరణాలు, పాశాంకుశాలు, వజ్రపు చీరె, కిరీటం, బంగారు చీరె, ముత్యాల చీరెలు ఉన్నాయి. విశేష పర్వదినాల్లో భక్తులకు అమ్మవారు వీటిలో దర్శనమిస్తారు. వీటితోపాటు విశేషంగా ప్రతి సోమవారం సాయంత్రం గజవాహన సేవ, మంగళవారం సాయంత్రం సువర్ణ రజిత అష్టదళ పాదపద్మసేవ, బుధవారం వెండి ఊయలసేవ, గురువారం స్వర్ణరథసేవ, శుక్రవారం పల్లకీ సేవ, శనివారం వెండి సింహాసనసేవ, ఆదివారం ఉదయం 108 కలశాలతో గో క్షీరంతో అభిషేకం, సాయంత్రం స్వర్ణరథసేవ నిర్వహిస్తారు.

విశేషంగా అమ్మవారి అలంకారాలు

దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరిదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు. 11న సాయంత్రం రాజరాజేశ్వరి దేవి, 12న భవానిదేవి, 13న శారదాదేవి, 14న అన్నపూర్ణాదేవి, 15న సాయంత్రం శ్రీదేవి వనవిహారిణి, రాత్రి బిల్వవృక్ష వాసిని పార్వతీదేవి, 16న గజలక్ష్మీదేవి, 17న సరస్వతీదేవి, 18న మహిషాసురమర్దినీ దేవి, 19న గాయత్రీదేవి, 20న విజయలక్ష్మీదేవి అలంకారం, శమీదర్శన మహోత్సవం, అర్ధరాత్రి తొట్టి మెరవణి, 21న వాసవీ కన్యకాపరమేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులు అమ్మవారి అలంకారాలను దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించాలని ఆర్యవైశ్యసభ వారు కోరారు.

శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో 136వ దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తున్నాం. రోజు భక్తులకు అమ్మవారి అలంకారాలు కనుల విందు చేయడంతోపాటు లోకకళ్యాణార్థం వేదపండితుల ఆధ్వర్యంలో వేదపారాయణలు, జపహోమాలు జరుగనున్నాయి.

– బుశెట్టి రాంమోహన్‌ రావు, ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు, ప్రొద్దుటూరు

ఎందరో మహనీయుల సమష్టి కృషికి ఈ ఆలయం చిహ్నమని చెప్పవచ్చు. ఇక్కడి సమీపంలోని పర్లపాడు గ్రామానికి చెందిన కామిశెట్టి చిన్న కొండయ్య అనే వ్యాపారికి కలలో కనిపించిన శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ‘పెనుగొండ వాసినైన నేను కడప జిల్లా పినాకిని నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రొద్దుటూరు పట్టణంలో కొలువు తీర ఉనున్నాను’ అని చెప్పడం జరిగింది. తనకు ఒక రమ్యమైన ఆలయాన్ని నిర్మింప చేయాలని చెప్పడంతో 135 ఏళ్ల క్రితం వ్యాపారి కామిశెట్టి చిన్న కొండయ్య ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1895 నుంచి నిర్మాణ ఖర్చులతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎందరో మహానుబావులు, జాతీయ, రాష్ట్ర రాజకీయ నాయకులు, పదవిలో ఉన్నవారు ఆలయాన్ని దర్శించుకున్నారు. 1929లో జాతిపిత మహాత్మాగాంధీ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతిలు ఆలయంలో 40 రోజుల పాటు బస చేసి యజ్ఞయాగాదులు నిర్వహించారు. అమ్మవారి శాల గర్భగుడి లోపల గ్రానైట్‌ రాతితో, మార్బుల్‌ రాళ్లతో మనోహరంగా తీర్చిదిద్దారు. గర్భగుడికి వెండి తొడుగులను అమర్చారు. ఆలయంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర దేవి జన్మ వృత్తాంతం తెలిపే చిత్రపటాలు దర్శనమిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement