రాజంపేటలో నటి అనసూయ సందడి | - | Sakshi
Sakshi News home page

రాజంపేటలో నటి అనసూయ సందడి

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

రాజంపేట: సినీనటి, యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ రాజంపేట పట్టణంలో సందడి చేశారు. సోమవారం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ షాపింగ్‌ మాల్‌ను ఆమె ప్రారంభించారు. రిబ్బన్‌ కట్‌ చేసిన అనంతరం మాల్‌లోని చీరల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా వేదికపై అనసూయ తనదైన శైలిలో మాట్లాడారు. సినీ గీతాలకు డ్యాన్స్‌ చేసి అభిమానులను, యువతను ఉత్సాహపరిచారు. నటి అనసూయను చూసేందుకు రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పాత బస్టాండు నుంచి ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించగా.. పోలీసులు వాహనాలను బైపాస్‌ రోడ్డు వైపు మళ్లించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌, మాల్‌ యాజమాన్యం జానపాటి రామ్మోహన్‌, బాలాజీ, బాలకృష్ణ, వెంకటేశ్‌, నీరజ, మౌనిక, రేవతి తదితరులు పాల్గొన్నారు.

అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు

ప్రొద్దుటూరు క్రైం : దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి ఆర్టీఓ నారాయణనాయక్‌ హెచ్చరించారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని ట్రావెల్స్‌ యజమానులు, బస్సు డ్రైవర్లు, సహాయలకు సూచించారు. సోమవారం ప్రొద్దుటూరులోని ట్రావెల్స్‌ యజమానులు, బస్సు డ్రైవర్లతో రవాణాశాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. దసరా పండుగకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకుంటారని, ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచి వసూలు చేయరాదన్నారు. ప్రయాణికుల నుంచి నిబంధనలకు అనుగుణంగా చార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేశారు. అధిక చార్జీలు వసూళ్లను అరికట్టేందుకు రవాణాశాఖ అధికారులు ప్రతి రోజూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని నారాయణనాయక్‌ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే సంబంధిత ట్రావెల్స్‌ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎంవీఐలు హేమకుమార్‌, రవీంద్రనాయక్‌, శ్రీనివాసరెడ్డి, ట్రావెల్స్‌ యజమానులు పాల్గొన్నారు.

ఇల్లు అమ్మాలని దాడి

– కళ్లల్లో కారం కొట్టి దౌర్జన్యం

కడప రూరల్‌: ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, లేదంటే తమకే అమ్మేయాలంటూ ఒక గిరిజన కుటుంబంపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. బాధితుల కళ్లల్లో కారం కొట్టి, కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన కడప నగరంలోని ఎస్సార్‌ నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎస్‌. శకుంతల తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్టీ వర్గానికి చెందిన ఆమె కుటుంబం గత కొంతకాలంగా ఎస్సార్‌ నగర్‌లో నివాసముంటోంది. అయితే, గత రెండేళ్లుగా స్థానికంగా ఉండే కొంతమంది వీరిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిందితులు శకుంతల నివాసం వద్దకు వచ్చి, ఇల్లు ఖాళీ చేయాలని లేదా తమకు అమ్మేసి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. బాధితులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన నిందితులు.. కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారి కళ్లల్లో కారం కొట్టి విచక్షణారహితంగా దాడి చేశారు.ఈ దాడిలో శకుంతల పెద్ద కుమారుడు ఎస్‌. భరత్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సోమవారం జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. నిందితుల నుండి తమ ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని, తమకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

గ్రామకంఠం ఆక్రమణ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం ఉందని బరితెగిస్తున్నారు. గ్రామ ప్రజలకు ఉపయోగకరమైన గ్రామకంఠం భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికి ఒత్తాసు పలకడంతో గ్రామ ప్రజలు జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలసపాడు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన సర్వే నబర్‌ 56, ఎల్‌.పి.నెం. 163 లో 10.88 ఎకరాలు గ్రామకంఠం ఉంది. సదరు గ్రామకంఠంలో ప్రజలందరూ అవసరాల కోసం సుమారు 50 సెంట్ల భూమిని ఖాళీగా ఉంచారు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఆ భూమిపై కన్నుపడి గ్రామంలో లేని కొందరి ద్వారా డాకుమెంట్లు సృష్టించి భూమి ఆక్రమణకు ప్రయత్నించాడు. దీనిని ప్రజలు అడ్డుకోవడంతో పోలీసుల ద్వారా కొందరి గ్రామ పెద్దలను బెదిరించి ఆక్రమణకు పాల్పడ్డాడు. ఈ విషయంపై గ్రామ ప్రజలు జిల్లా అధికారులకు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. జిల్లా అధికారులు టీడీపీ నాయకుడికి ఒత్తాసు పలుకుతారా లేక ప్రజలకు న్యాయం చేస్తారా వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement