కాశినాయన : మండలంలోని సావిశెట్టిపల్లె అటవీ బీట్ నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కంటైనర్‌ను, రెండు కార్లను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుని పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్మగర్లను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడపకు కంటైనర్‌ను, రెండు కార్లను, స్వాధీనం చేసుకున్న 74 ఎర్రచందనం దుంగలను తరలించారు. అయితే అధికారికంగా అటవీ అధికారులు కానీ, టాస్క్‌ఫోర్స్ అధికారులు కానీ వెల్లడించలేదు.
బాలిక అదృశ్యంపై ఫిర్యాడు
కలసపాడు : మండలంలోని ఎగువ తంబళ్ళపల్లె గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి కనిపించలేదు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు వారి బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో బాలిక తండ్రి రాజశేఖర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు ఈనెల 10వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి వైద్యసేవల కోసం వచ్చాడు. వచ్చిన కొంతసేపటికే మృతి చెందాడు. అతని ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని కడప రిమ్స్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక టీబీరోడ్డులోని స్వరూప్ కుమార్ కంటి ఆస్పత్రి సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలియడంతో త్రీ టౌన్ ఎస్‌ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతిగా మద్యం సేవించి లేదా ఇతర కారణాలతో చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద అతనికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభిచంలేదు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ వ్యక్తికి సంబంఽధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే త్రీ టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు,
విద్యుదాఘాతంతో రైతు..
లింగాల: లింగాల మండలం తాత రెడ్డి పల్లె లో సోమ వారం విద్యుదాఘాతంతో తోటా రమణారెడ్డి(55) అనే రైతు మృతి చెందాడు. వివరాలు.. రమణారెడ్డి సాయంత్రం అరటి పంటకు డ్రిప్పు ఎరువులు ఎక్కించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లగా ట్రాక్టర్ వద్ద ఉన్న వైర్లు ప్రమాదవ శాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య కళావతి, ఒక కుమార్తె, కుమారుడు ఉ న్నారు.ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ బాండ్ల సేకరణ
కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల నుంచి బాండ్లను సేకరిస్తున్నామని, వాటిని సరిచూసి నివేదికను తమశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తామని సీఐడి డీఎస్పీ బి.లక్ష్మినారాయణ అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి అగ్రిగోల్డ్ బాధితుల నుంచి కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో వున్న ఆర్‌ఎస్‌ఐల రెస్ట్‌హౌస్‌లో స్వీకరిస్తున్నారు. సోమవారం వల్లూరు మండలానికి చెందిన బాధితుల నుంచి బాండ్లను సరిచూసి, సేకరించారు. సీఐడి విభాగం నుంచి ఇద్దరు సీఐలు, ఒక ఎస్‌ఐ, సిబ్బందితో కలిసి 16 మంది ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
రైతు బజార్‌లో బియ్యం
అమ్మకాలకు ప్రత్యేక కౌంటర్లు
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం బీపీటీ, కేఎన్‌ఎం రైస్ విక్రయాలను చేపట్టింది. ఇందులో భాగంగా కడప రైతు బజార్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు బీపీటీ బియ్యం కిలో రూ. 49, కేఎన్‌ఎం/ఆర్‌ఎన్‌ఆర్ బియ్యం కిలో రూ.50లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక కౌంటర్లను జిల్లా సరఫరా అధికారి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లయిస్, రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు నాణ్యమైన బియ్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


