ప్రజల్లో విశ్వాసం కోల్పోయామనే ఆందోళనతో ఉన్న పచ్చ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. అధికార బలంతో ‘అధ్యక్ష’ స్థానం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. తమ రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. తమ వర్గానికే ప్రాధాన్యత ఉండాలనే దిశగా ఆయా నేతలు అడుగులు వేస్తున్నారు. అలాగే అనుకూలుర అధికారుల కోసం ‘బదిలీ’ల పైరవీలూ సాగిస్తున్నారు.
● తమకు అనుకూలమైన రిజర్వేషన్ల కోసం పైరవీలు ముమ్మరం!
● అధినేత వద్ద పంచాయితీలు
● కడప ఓసీ మహిళకు దాదాపు ఖరారు...మోకాలొడ్డుతోన్న ఓ ఎమ్మెల్యే
● పులివెందుల ఓసీ జనరల్‌కు
కేటాయించకుంటే అభ్యర్థి కరువే!
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం చంద్రబాబు నేతృత్వంలలోని ఈ రెండున్నరేళ్ల పాలనలో కూటమి నేతలు ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ఈ క్రమంలో ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో గెలవాలని అధికార బలంతో కుయుక్తులు పన్నుతున్నారు. తొలుత మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పట్టణా లు, నగరాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇదివరకే స్థానికంగా వార్డులు, డివిజన్లలో అను వైన రిజర్వేషన్ కేటాయించుకునేందుకు కసరత్తు చేసిన తమ్ముళ్లు.. ఇప్పుడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ద్వారా పైరవీలు చేయించుకుంటున్నారు. రిజర్వేషన్లు తమకు అనువుగా తెప్పించుకొని పోటీ చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా పులివెందుల మున్సిపాలిటీ ఓసీకి రిజర్వుడు చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఓసీ అయితే కాస్తో కూస్తో సరైన అభ్యర్థిని బరిలో దించగలమని అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్లు సమాచారం. బీసీ లేదా ఎస్సీ కేటాయిస్తే అభ్యర్థులు దొరకడం కష్టమని ఖరాఖండీగా చెప్పినట్లు తెలుస్తోంది.
కడప ఓసీ మహిళ వద్దు!
కడప మేయర్ సీటు ఓసీ మహిళకు రిజర్వుడు చేయవద్దని ఓ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇవ్వగల్గితే ఎస్సీ మహిళకు కేటాయించాలని లేకుంటే ఓసీ జనరల్ కేటాయించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కాగా ఓసీ మహిళ రిజర్వు అయితే ప్రధానంగా ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవి పేరు విన్పిస్తోంది. ఆ మేరకు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఇటీవల అధినేతతో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఓసీ మహిళకు కాకుండా రిజర్వేషన్ చేయాలని ఓ ఎమ్మెల్యే పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ‘మేము కోరిన రిజర్వేషన్ చేయలేని పక్షంలో మేం సూచించిన అభ్యర్థికి టికెట్ కేటాయించాలని’ కోరుతున్నట్లు సమాచారం.
ప్రొద్దుటూరులో..
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అత్యధికంగా బీసీలున్నారు. ఆ స్థానం బీసీలకు కేటాయించవద్దని ఓ ఎమ్మెల్యే పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఓసీలకు కేటాయించాలని అప్పుడు తాము బలమైన అభ్యర్థిని బరిలో నిలపగలమని అధిష్టానం ఎదుట వాపోయినట్లు సమాచారం. అదేవిధంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎస్సీలకు కేటాయిస్తేనే తాము సునాయసంగా విజయం సాధించగలమని కూటమి ఎమ్మెల్యే కోరుతున్నట్లు సమాచారం. ఓసీలకు కేటాయిస్తే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటారని, కూటమికి కష్టతరంగా ఉంటుందని వివరించినట్లు తెలుస్తోంది.


