స్థానికఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

స్థానికఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లపై ఇప్పటికే దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల జిల్లా అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను దశలవారీగా సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మల్లికార్జునుడు, ఆర్డీవో మురళీ, జడ్పీ సీఈఓ సుబ్రహ్మణ్యం, డీపీఓ రామచంద్ర, నగర పాలక సంస్థ కమిషనర్‌ భవానీప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాపై ప్రత్యేక పునఃపరిశీలన

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడాలనే ఎన్నికల సంఘం లక్ష్యానికి అనుగుణంగా ప్రత్యేక పునఃపరిశీలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా జూన్‌ 15 నుంచి జూలై 24 వరకు బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో 9,524 మంది అనర్హులుగా గుర్తించగా, గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, బహుళ నమోదులు (ఏఎస్‌డీడీ) కింద 2,44,919 మంది ఓటర్ల వివరాలు గుర్తించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ వివరాలను బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి మరోసారి పరిశీలించి, సంబంధిత ఓటర్ల వివరాలను ధ్రువీకరించనున్నట్లు చెప్పారు. పొరపాటున అర్హుడై ఓటరు పేరు తొలగిపోయినట్లు గుర్తిస్తే, సంబంధిత వ్యక్తితో ఫారం–6 దరఖాస్తు చేయించి నిరంతర నవీకరణ ప్రక్రియలో ఓటర్ల జాబితాలో పేరు చేర్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

16న తుది జాబితా విడుదల

ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 16న ప్రచురించనున్నట్లు తెలిపారు. తుది జాబితాలో పేరు లేకపోయిన అర్హులైన వారు, తదుపరి అర్హత తేదీల నాటికి 18 ఏళ్లు పూర్తిచేసి అర్హత పొందిన వారు నిరంతర నవీకరణలో భాగంగా ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement