● ముస్తాబవుతున్న ఆలయాలు
● భారీ సెట్టింగులో నిమగ్నమైన కార్మికులు
ప్రొద్దుటూరు కల్చరల్ : దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా దసరా సంబరాలకు రెండో మైసూరుగా ఖ్యాతిగడించిన ప్రొద్దుటూరులో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాలకు రంగులు వేయడంతోపాటు చలువ పందిళ్లు వేస్తున్నారు. భారీ సెట్టింగ్‌లు, విద్యుత్ దీపాలంకరణ, ఆలయ గోపురాలకు విద్యుత్ దీపాలంకరణ చేయడంలో పలు ప్రాంతాలకు చెందిన కార్మికులు నిమగ్నమయ్యారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం, శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి, అగస్త్యేశ్వరస్వామి ఆలయం, రతనల వెంకటేశ్వరస్వామి ఆలయం, రాజరాజేశ్వరిదే వి ఆలయం, చౌడేశ్వరిదేవి ఆలయం, పెద్దమ్మతల్లి ఆలయంతోపాటు పలు ఆలయాలలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆయా ఆలయాల ఉత్సవాల కమిటీ సభ్యులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. దేవతామూర్తులను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. దసరా ఉత్సవాలు నిర్వహించే ఆలయాల వీధులను రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. మైదుకూరు రోడ్డు, రాజీవ్ సర్కిల్, జమ్మలమడుగు రోడ్డులతోపాటు పలు ప్రధాన కూడళ్లలో దసరా ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల విద్యుత్ ఆర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. దసరా ఉత్సవాలను గత ఏడాది కంటే వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.


