సర్కారు సర్దుపోటు | - | Sakshi
Sakshi News home page

సర్కారు సర్దుపోటు

Jul 28 2026 2:12 AM | Updated on Jul 28 2026 2:12 AM

కడప ఎడ్యుకేషన్‌: ‘ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే చాలు.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వాటంతట అవే జరిగిపోవాలి’ అంటూ గతంలో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా గొప్పగా ప్రకటించి, ప్రత్యేకంగా ఉపాధ్యాయ బది లీల చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టం ప్రకారం 2025 జూన్‌ నెలలో బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ తీరా 2026 మే నెల వచ్చేసరికి సీన్‌ రివర్స్‌ అయింది. తాము తెచ్చిన చట్టాన్ని తామే తుంగలో తొక్కు తూ, ఈ ఏడాది బదిలీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ‘జిల్లాల విభజన’ సాకును తెరపైకి తెచ్చి చట్టాన్ని అటకెక్కించారు. కేవలం తాత్కాలిక ‘సర్దుబాటు’తో ఈ ఏడాదికి పెద్ద గండం గడిచిపోయిందన్నట్లుగా ‘మమ’ అనిపించారు.

వేధిస్తున్న అయ్యవార్ల కొరత

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జూన్‌ ఆఖరి నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని అధికారులు సర్దుబాటు ప్రక్రియను ముగించారు. ముందుగా మండల స్థాయిలో, ఆ తర్వాత డివిజన్‌ స్థాయిలో, ఆపై జిల్లా స్థాయిలో మిగిలిన ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లను గుర్తించి అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేశారు. మూడు అంచెలుగా ఈ తంతు ముగిసినప్పటికీ, జిల్లావ్యాప్తంగా ఇంకా 360 మంది ఉపాధ్యాయుల అవసరం ఉన్నట్లు విద్యాశాఖే అధికారికంగా గుర్తించింది. సర్దుబాటు ప్రక్రియ ముగిసి రోజులు గడుస్తున్నా.. నేటికీ ఉన్నత పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులను నియమించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

కీలక సబ్జెక్టులకు తీవ్ర కొరత..

ప్రస్తుతం చాలా ఉన్నత పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకూ అరకొరగానే ఉపాధ్యాయులు ఉన్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక శాస్త్రం, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల ఉపాధ్యాయ పోస్టులు అత్యధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వచ్చే నెలలోనే విద్యార్థులకు ఎఫ్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముంచుకొస్తున్నా హైస్కూళ్లలో కీలకమైన సబ్జెక్టులకు ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండటం వల్ల విద్యాబోధన పూర్తిగా కుంటుపడింది. దీనివల్ల ఈ ఏడాది బోర్డు పరీక్షలు రాయబోయే పదవ తరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది.

పదోన్నతులకు ‘బ్రేక్‌’...

ప్రభుత్వం సకాలంలో అంటే మే, జూన్‌ నెలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్‌ అసిస్టెంట్‌, ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించి ఉంటే.. నేడు హైస్కూళ్లలో ఈ స్థాయిలో ఉపాధ్యాయుల కొరత ఉండేది కాదు. ఈ విషయమై విద్యాశాఖ కమిషనర్‌తో ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఉపాధ్యాయులకు రావాల్సిన పాత బకాయిలు, ఇతర ఆర్థిక లావాదేవీల ఊసే ఎత్తడం లేదు. కనీసం బకాయిల సంగతి అటుంచితే, నిత్యం వేధిస్తున్న పరిపాలనాపరమైన సమస్యలనైనా పరిష్కరిస్తారా అంటే అదీ లేదు. సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో అయ్యవార్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement