● అదే జరిగితే దేశం
రెండు ముక్కలు అవుతుంది
● కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
కడప రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఏలుబడిలో అన్ని వర్గాల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు. విద్యార్హతకు తగిన విధంగా ఉద్యోగాలు లభించడం లేదని తెలిపారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యయం పెరిగింది గానీ ఆదాయం పెరగలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అదే గనుక జరిగితే దేశం రెండు ముక్కలవుతుందని హెచ్చరించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పై రూ 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. కాపు వర్గాల్లో ముఖ్యమంత్రి కావాలనే కాంక్ష ఉందని, టీడీపీలో కాపులు ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని తెలిపారు.


