ముద్దనూరు: మండలంలోని యామవరం గ్రామానికి చెందిన కొండయ్య అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు 49 సంవత్సరాల కొండయ్య ఈనెల 18న ఇంటినుంచి వెళ్లాడు.ఇతను కాండ్లోపల్లె సమీపంలోని ఓ తోటలో పనిచేస్తున్నాడు. అతని గురించి కుటుంబసభ్యులు బంధువులు,స్నేహితులతో విచారించినా ఆచూకీ లభ్యంకాలేదు.కొండయ్య కూతురు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
డ్రిప్ పరికరాలు ధ్వంసం
మైదుకూరు : మండలంలోని తిప్పిరెడ్డిపల్లె కొత్తపల్లె వద్ద ఇరువురు రైతులకు చెందిన పసుపు తోటలో అమర్చిన డ్రిప్ పరికరాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. బాధిత రైతుల్లో అందే సుబ్బారావు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. టి.కొత్తపల్లెకు చెందిన అందే సుబ్బారావు, బండి లక్ష్మీ రమాదేవి అనే వారు తమకున్న 5.80 ఎకరాలకు కొన్నేళ్ల కిందట డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఉమ్మడిగా పసుపు పంటను సాగు చేశారు. శనివారం వైద్య పరీక్షల కోసం సుబ్బారావు చైన్నెకి వెళ్లారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చి పొలం వద్దకు వెళ్లగా డ్రిప్ పరికరాలు ధ్వంసం చేసి ఉండటం గమనించారు. పొలంలో ఉన్న 8 ప్రెస్ వాల్వులను దుండగులు పగలగొట్టారు. దీంతో తమకు రూ.25వేలు నష్టం వాటిల్లిందని, పంటకు నీరు పెట్టే అవకాశం లేకుండా పోయిందని రైతు సుబ్బారావు వాపోయారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ల నిర్వహణకు ఆహ్వానం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: బీఎస్‌ఎన్‌ఎల్ ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్, విజయవాడ జనరల్ మేనేజర్ కార్యాలయం ఆధ్వర్యంలో కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ల అపరేషన్స్, మెయింటెనెన్స్ పనులను అవుట్ సోర్సింగ్ విధానంలో నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) కోం ఆన్‌లైన్ బిడ్‌లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్‌పాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ నోటిఫికేషన్ జులై నెలలో విడుదల కాగా బిడ్‌ల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 30 ఉదయం 11 గంటలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఆసక్తిగల సంస్థలు ఏజన్సీలు.. నిబంధనలు, షరతులు, ఇతర పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వ ఈ– టెండర్ పోర్టల్‌లో పరిశీలించి ఆన్‌లైన్ ద్వారా బిడ్‌లను సమర్పించాలని సూచించారు. సంబంధిత వివరాల కోసం కేంద్ర ప్రభుత్వ ఈ–టెండర్ పోర్టల్‌ను సందర్శించాలని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు.
ఫిర్యాదులను నిర్ణీత
గడువులోగా పరిష్కరించాలి
కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 130 ఫిర్యాదులు వచ్చాయి.వీటిని పరిశీలించి చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ ఎన్. సుధాకర్ , పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


