కడప సెవెన్‌రోడ్స్ : యువతలో ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పి–4 విధానం ద్వారా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ‘స్టార్టప్ కడప’నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావనతో కలిసి సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ‘ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్’అనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా జిల్లా యంత్రాంగం వినూత్నంగా ఈ కేంద్రాన్ని రూపొందిస్తోందన్నారు. యువతలో సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందిస్తూ, కొత్త వ్యాపారాలకు మార్గనిర్దేశం చేసే కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోందని చెప్పారు. నిర్మాణ పనులు దాదాపు పూర్త య్యాయని, ప్రస్తుతం ఫినిషింగ్ పనులు, గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్ణీత గడువులోపు అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో కడప నగర పాలక సంస్థ కమిషనర్ భవానీ ప్రసాద్, ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి, హౌసింగ్ పీడీ రాజారత్నం, స్టెప్ సీఈవో జోయల్ విజయ్ కుమార్, కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్ డిజైనర్లు, ఎడిపి యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా ‘స్మార్ట్ కిచెన్ల’ విస్తరణ
జిల్లాలో కిచెన్ మేనేజర్లుగా ఎస్.హెచ్.జి. మహిళల ఆధ్వర్యంలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు జిల్లా యంత్రాంగం గర్వించదగ్గ విషయమని కలెక్టర్ డాక్ర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ లో స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, మరింత విస్తత పరిచేలా చేపట్టిన అదనపు స్మార్ట్ కిచెన్‌ల నిర్మాణ పురోగతిపై.. సంబంధిత కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందుతున్న సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రస్తుతం దశలవారీగా స్మార్ట్ కిచెన్ల విస్తరణ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. త్వరలో జిల్లాలో ప్రతిరోజూ సుమారు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో స్మార్ట్ కిచెన్ నోడల్ అధికారి జోయెల్ విజయకుమార్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి, ఏపీ సీఎన్‌ఎఫ్ డీపీఎం ప్రవీణ్ కుమార్, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


