● తల్లికి వందనం పేరుతో
తల్లులను వంచించారు
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : రెండేళ్లలో కూటమి నేతలు చేసిన అభివృద్ధి ఏమిటో, ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయో పరిశీలించుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో ఆయన సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చూపించి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు మార్చి కూటమి నేతలను ఇంటింటికి వెళ్లాలని ఆర్భాటంగా ప్రకటించారన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న అమ్మ ఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం పేరుతో తల్లులందరిని వంచించారన్నారు. ఈ పథకంలోనే నాలుగు రకాలుగా తల్లులు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి మొదటి ఏడాది అసలు ఈ పథకాన్నే అమలు చేయలేదన్నారు. రెండో ఏడాది నుంచి 80 లక్షల మందికి ఇవ్వాల్సిన ఈ పథకాన్ని 60 లక్షలకు కుదించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.15వేలు ఇస్తామని రూ.13వేలే ఇచ్చారన్నారు. ఈ పథకం ద్వారా రూ.5వేలు, రూ.6వేలు మాత్రమే మంజూరైన వారు కూడా ఉన్నారని తెలిపారు.
ఊరూరా ఎందుకు ప్రచారం
కూటమి నేతలు ఏమి సాధించారని ఊరూరా ఇంటింటికి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలను ఆదేశించారో అర్థం కావడం లేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. సిగ్గులేకుండా అబద్దపు హామీలు ఇచ్చి మళ్లీ ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకుని వెళుతున్నారని ప్రశ్నించారు. ఆడ బిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదన్నారు. 2018లో ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇచ్చిన తరాహాలోనే ఈ పథకం అమలు చేస్తారేమో వేచి చూడాల్సి ఉందన్నారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని, వారి నుండి కూటమి నేతలకు చేదు అనుభవం ఎదరయ్యే అవకాశం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారిని అడ్డుకుంటే కూటమి నేతలకు ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరిగిన లాంటి సంఘటనలే పునరావృతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఏడాదికి రూ.26వేలు ఇస్తామని రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకు ఇస్తామన్న పింఛన్ పథం ఏమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్‌లైనా ఇంత వరకు కొత్త పింఛన్ ఒక్కటి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఇలా ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలనున ఇచ్చి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అడుగడుగునా ప్రజలు చొక్కా పట్టుకుని కూటమి నేతలను నిలదీసే అవకాశం ఉందన్నారు.
పోటో రైటప్స్:


