కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ ! | - | Sakshi
Sakshi News home page

కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !

గ్రీన్‌హైవే నిర్మాణప్రక్రియలో సర్వీస్‌ రోడ్లు లేకపోవడంపై స్థానికుల్లో ఆందోళన

సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని భక్తులు,యాత్రికుల డిమాండ్‌

రాజంపేట: గ్రీన్‌ హైవే (కడప–రేణిగుంట నేషనల్‌ హై వే) నిర్మాణంలో సర్వీసు రోడ్డుకు మోక్షం కరువైంది.. శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రకృతి ఒడిలో పయ నించే గ్రీన్‌హైవే నుంచి మెయిన్‌ రోడ్డుపైకి రావడానికి ‘కనెక్టివిటీ’ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రఖ్యాత ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి కూడా సర్వీస్‌ రోడ్డు నిర్మించకపోవడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా రూ.4వేల కోట్ల వ్యయంతో రా యలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన ఈ గ్రీన్‌హైవేని మరో రెండేళ్లలో పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.

గ్రీన్‌హైవే నుంచి సర్వీసురోడ్డు లేదంటా..

గ్రీన్‌హైవే నుంచి పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు సర్వీసురోడ్లు నిర్మించడం లేదంటూ నిర్మాణ సంస్థలు తేల్చిచెప్పాయి. అసలు గ్రీన్‌హైవే రోడ్‌ మ్యాప్‌లో సర్వీస్‌ రోడ్ల ప్రతిపాదనే లేదని కాంట్రాక్ట్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. సర్వీసురోడ్డు నిర్మాణం చేయాలంటే కేంద్రం నుంచే ఆదేశాలు రావాలని వివరిస్తున్నారు.

రామయ్య వద్దకు వెళ్లేదేలా..

కడప–రేణిగుంట నేషనల్‌హైవేలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. గ్రీన్‌ హైవే నుంచి సర్వీస్‌ రోడ్డు లేకపోతే ఈ ప్రముఖ ఆలయాలకు, ఆయా ప్రాంతాల కు వెళ్లేదెలా అంటూ యాత్రికులు,భక్తులు, పర్యాటకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాలకు సంబంధంలేని ఏరియాలో సుదూర ప్రాంతంలో కనెక్టటివి ఇవ్వడంవల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే భూసేకరణ చేసైనా సర్వీ స్‌ రోడ్లు నిర్మించాలని పర్యాటకులు కోరుతున్నారు.

కూటమి ఎంపీలు స్పందించాలి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం చెందిన జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట నందలూరు కేంద్రాలకు కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నుంచి కనెక్టిటివి రోడ్‌ (సర్వీసురోడ్డు) అవసరమని భక్తులు గట్టిగా వాదిస్తున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ఎంపీలు స్పందించి కేంద్రపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement