కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణా, సరఫరా వ్యవస్థను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజంపేట మండల పరిధిలోని కొన్ని భూముల్లో ఇసుక తవ్వకాల అనుమతిపై చర్చించి, నిర్ణయాన్ని కమిటీ తీసుకోనుందని పేర్కొన్నారు. అలాగే అన్నమయ్య జిల్లాలో బాహుదా నదిలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌కు సంబంధించిన ఏజెన్సీ అధిక ఖర్చులు, తక్కువ ఇసుక లభ్యత కారణంగా పనులు నిలిపివేయాలన్న అభ్యర్థనపై కూడా సమావేశంలో చర్చించారు. దీనిపై తుది నిర్ణయాన్ని కమిటీ తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షా కాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు నిరంతర ఇసుక సరఫరా కల్పించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక లక్ష్యాన్ని నిర్ణయించిన నేపథ్యంలో,6 సెమీ–మెకనైజ్డ్ రీచ్‌లు, 2 మాన్యువల్ రీచ్‌లను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు జిల్లా, డివిజనల్ స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


