జమ్మలమడుగు : ఇటీవల ఉప్పలపాడు సమీపంలో బీటెక్ యువతి లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి కుమారుడితో ప్రేమాయణం నడిపి అతని చేతిలో మోసపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందా అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యువతి లావణ్య బీటెక్ చదువుకుంది. రెండు సంవత్సరాల క్రితం పట్టణంలోని ఒక ‘జిం’ సెంటర్‌లో ఇరువురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వ్యాపారస్తుడి కుమారుడు తనకు పెళ్లి కాలేదని పెండ్లి చేసుకుంటానని లావణ్యతో ప్రేమాయణం నడిపించాడు. అయితే అప్పటికే వివాహం జరిగి అతనికి పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతికి నిజం తెలియడంతో తనను మోసం చేశాడని గతంలో అతనితో గొడవ పడటం జరుగుతూ వచ్చింది.
ఇంటి వద్దకు వెళ్లి గొడవపడ్డారు..
యువతి కుటుంబ సభ్యులు పట్టణంలోని వస్త్ర వ్యాపారి ఇంటి వద్దకు వెళ్లి తమ పాపతో అక్రమ సంబంధం కలిగి ఉండటంపై ఇంటి వద్దకు వెళ్లి గొడవపడినట్లు సమాచారం. అయితే కొంత మంది పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి పంపించేశారు. దీంతో వ్యాపారి కుటుంబంలో సైతం భార్యభర్తలు గొడవపడినట్లు సమాచారం. మీకు న్యాయం చేయించే బాధ్యత తమదేనంటూ కొంత మంది భరోసా ఇచ్చి పంపించారని తెలిసింది.
ఆత్మహత్యకు ప్రేరణ కల్పించిందెవరు!
యువతి లావణ్య దొమ్మరనంద్యాల గ్రామం నుంచి పట్టణంలోని పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి పెట్రోల్ పోయించుకుని ఆత్మహత్య చేసుకోవటానికి తీసుకుపోయింది. అయితే అప్పటికే ఆమె పట్టణంలో ఎవరితో మాట్లాడింది.. ఏమి జరిగిందో ఏమో తెలియదు కాని నేరుగా పెట్రోల్ బంకు వద్ద బాటిల్‌లో పెట్రోల్ పోయించుకుని కోవెలకుంట్ల బైపాస్ వద్ద నుంచి నేరుగా ఉప్పలపాడు రహదారిలో ఉన్న రోడ్డు పక్కన ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే పెట్రోల్ పట్టించుకునే ముందు సైతం ప్రేమించిన వ్యక్తికి ఫోన్ చేసి తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిందని.. నీవు చస్తే నాకేమిటని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. మృతురాలు చివరి కాల్ కూడా అతనికే చేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో లావణ్యకు సంబంధించిన ఫోన్ మాయమైపోయింది. ఆమె ఎవరితో మాట్లాడిందన్న కోణంతోపాటు, ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్‌లో ఎవరితో మాట్లాడిందన్న విషయాన్ని బయటకు తీస్తే ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ప్రేరేపించిన వ్యక్తుల వివరాలు బయట పడుతాయని లావణ్య బంధువులు , గ్రామస్తులు పేర్కొంటున్నారు. యువకుడికి పెండ్లి అయినా కూడా కాలేదని ఆమెను మోసం చేశాడని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పోర్టుమార్టం రిపోర్టు వస్తే తెలుస్తుంది..
లావణ్య మృతికి కారణం ఏమిటో అన్న విషయం పోర్టుమార్టం రిపోర్టులో తెలుస్తుంది. ఆ రిపోర్టులో ఆమె గర్భవతా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి మేమేమీ చెప్పలేము.
– నరేష్‌బాబు, అర్బన్ సీఐ, జమ్మలమడుగు
ప్రేమ పేరుతో మోసం చేశాడనే
మనస్థాపంతోనేనా..?


