రీచ్‌ మాటున ఇసుక అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

రీచ్‌ మాటున ఇసుక అక్రమ రవాణా

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

బహుదా నదిలో భారీగా తవ్వకాలు

సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు

క్వారీ రద్దు చేయాలని గ్రామస్తుల నిరసన

సుండుపల్లె : మండల కేంద్రంలోని ఎరమనేనిపాలెం గ్రామ పంచాయతీ కుప్పగుట్ట సమీపంలోని రీచ్‌ నుంచి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి అండదండలతో వందలాది టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారని బహుదానది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతన్నలు సుండుపల్లెలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని పేర్కొన్నారు. బహుదా నదిలోని రీచ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోర్లలో నీరు సరిగ్గా రావడం లేదన్నారు. దీంతో నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందడం లేదని వాపోయారు. బహుదానది నీటితో దాదాపు 40 నుంచి 50 వేల మంది జనాభాకు తాగునీరు, కొన్ని వందల ఎకరాల భూములకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. బహుదానదిలో ఇసుక ఖాళీ అవుతుండటంతో భూగర్భజలం తగ్గిపోయి, సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు వాపోయారు.

ప్రేక్షక పాత్రకే పరిమితమైన అధికారులు

ప్రభుత్వ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్‌లో 1.79 హెక్టార్లలో 1 మీటర్‌ లోతు వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ క్వారీ దక్కించుకున్న నిర్వాహకులు దాదాపు 50 హెక్టార్లలో 8 మీటర్ల లోతు నుంచి 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తోడేసి నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు అవసరమైతే క్వారీని రద్దు చేయాల్సిన సంబంధిత అధికారులు.. క్వారీ వద్దకు వచ్చి అక్రమంగా ఎంత మేర ఇసుకను తోడారో కనీసం కొలతలు కానీ, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకుండా ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. ఇష్టారాజ్యంగా లోతుకు వెళ్లి ఇసుకను తోడేస్తూ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌తో రెండు టిప్పర్‌లకు ఒకే నంబర్‌ గల ప్లేట్లను వేసి ఇసుకను తరలిస్తున్నారని పేర్కొన్నారు. పలుమార్లు అర్జీల రూపంలో తెలియజేసినా అధికార పార్టీకి చెందిన నాయకుని అండదండలతో ఏ ఒక్క మండల అధికారి అక్కడికి వెళ్లి తనిఖీ చేయడం లేదని తెలిపారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక క్వారీని రద్దు చేయించి, తమకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుతున్నాన్నారు.

తహసీల్దార్‌ హామీతో నిరసన విరమణ

నిరసన కార్యక్రమం వద్దకు చేరుకున్న తహసీల్దార్‌ గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక క్వారీ వద్ద వీఆర్‌ఓ, వీఆర్‌ఏలతోపాటు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకుని, ఇసుక తవ్వకాలను తక్షణమే రద్దు చేస్తామని గ్రామస్తులకు తెలపడంతో వారు వెనుతిరిగారు. ఇసుక క్వారీని రద్దు చేయకుండా మళ్లీ ఇసుకను తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement