జిల్లాలో ఇప్పటివరకు...
కడప సెవెన్‌రోడ్స్: జనాభా లెక్కల సేకరణ–2027 ప్రారంభం కానుంది. పదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం 2021లో జరగాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు చేపట్టనున్నారు. స్వాతంత్య్రం తర్వాత ఎనిమిదవది, మొత్తంగా పదహారవదైన జన గణనకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇది కాగితాలతో పని లేకుండా తొలిసారి చేపడుతున్న సంపూర్ణ డిజిటల్ గణన కావడం విశేషం. దీన్ని రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో భాగంగా ఈనెల 16 నుంచి 30వ తేది వరకు స్వీయ గణన ఉంటుంది. మే 1 నుంచి 30 వరకు హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ నిర్వహిస్తారు. రెండవ దశ కింద వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వ తేది వరకు జనాభాను లెక్కిస్తారు.
సొంతంగా నమోదుకు అవకాశం
ఈనెల 16 నుంచి 30వ తేది వరకు స్వీయ గణన కార్యక్రమం జరగనుంది. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తామే నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజలు ఎన్యుమరేటర్ల కోసం ఎదురు చూడకుండా ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా తమ మొబైల్ నెంబరుతో లాగిన్ అయి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు.
సామాజిక, ఆర్థిక వివరాల సేకరణ
మే 1 నుంచి 30వ తేది వరకు హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తారు. ప్రజల ఇళ్ల వివరాలు నమోదు చేస్తారు. ఇంటిలో ఉన్న వ్యక్తుల సంఖ్య, కుటుంబ యజమాని, తాగునీరు, మరుగుదొడ్లు, మురికి నీరు బయటికి వెళ్లేందుకు గల అవకాశం, బాత్‌రూము, వంట గ్యాస్, రేడియో, టెలివిజన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టెలిఫోన్, వాహనాలు తదితర 33 అంశాలకు సంబంధించిన వివరాలను రాబట్టి నమోదు చేస్తారు. 1931 తర్వాత తొలిసారిగా అన్ని కులాలకు చెందిన గణనను ఈ ప్రక్రియలో చేర్చడం విశేషం.
ప్రధాన ఉద్దేశ్యం
ప్రజల సామాజిక, ఆర్థిక హోదాలను తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా విద్య, వైద్యం, ఇతర సంక్షేమ పథకాల రూపకల్పనకు జనాభా గణన దోహదపడుతుంది. దేశ ప్రణాళిక రచన, అభివృద్ధిలో జనాభా గణన కీలకమైంది. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతోపాటు మానవ వనరుల అంచనాకు దోహదపడుతుంది.
జిల్లాలో తొలిసారి 1836లో జనాభా లెక్కలు సేకరించారు. అప్పట్లో కోయిలకుంట్ల, మదనపల్లె, వాయల్పాడు, కదిరి తాలూకాలు జిల్లాలో ఉండేవి. ఇంపీరియల్ గెజిటీర్‌లో ఉన్న వివరాల మేరకు అప్పట్లో జిల్లా జనాభా 10,81,221. ఇందులో పురుషులు 5,67,228 కాగా మహిళలు 5,14,033మంది ఉన్నారు. ఇళ్ల సంఖ్య 2,21,248. ఇక క్రమం తప్పకుండా 1871 నుంచి పదేళ్లకు ఒకసారి జనాభా గణన కొనసాగుతోంది.
ఇది తొలి సంపూర్ణ డిజిటల్ గణన
16 నుంచి స్వీయ గణన
మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్
సామాజిక, ఆర్థిక వివరాల సేకరణ
ఎన్యుమరేటర్లు 4421,సూపర్‌వైజర్లు 773
జన గణనకు సంబంధించి కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, జాయింట్ కలెక్టర్ అడిషనల్ ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా, డీఆర్వో జిల్లా సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. సీపీఓ, డీఈఓ, డీపీఓ, జిల్లా అటవీ అధికారి, జెడ్పీ సీఈఓ, సర్వేశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అదనపు జిల్లా సెన్సెస్ అధికారులుగా, చీఫ్ ప్లానింగ్ అధికారి డిప్యూటీ జిల్లా సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అలాగే సబ్ డివిజనల్, మున్సిపల్, మండల స్థాయిల్లో అధికారులను నియమించారు. జిల్లాలో నాలుగు వేల మంది ఎన్యుమరేటర్లను నియమించారు. 10 శాతం రిజర్వుతో 421 మందిని కలిపితే మొత్తం వీరి సంఖ్య 4421. ఇక 687 మంది సూపర్‌వైజర్లను నియమించారు. పది శాతం రిజర్వు ప్రకారం 86 మందిని కలిపితే మొత్తం 773 మందిని నియమించారు. వీరంతా జిల్లాలోని 616 గ్రామాలు, 8 పట్టణాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 48 మండలాల్లో జనాభా వివరాలను సేకరించాల్సి ఉంటుంది.


