ఒంటిమిట్ట: కడప ఆకులవీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానంలో శ్రీ బిట్రా పట్టాభిరామయ్య భగవద్గీత సత్సంగంలో శుక్రవారం సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు ఒంటిమిట్ట శ్రీ పోతన సాహితీ పీఠం కార్యదర్శి విద్వాన్ ముమ్మడి నారాయణరెడ్డి ‘భాగవతం–గజేంద్రమోక్షం’అంశంపై ప్రవచనం అందించనున్నారు. గజేంద్రుని భక్తి, శ్రీ మహా విష్టువు కృపా కటాక్షం వంటి అంశాలను హృద్యంగా వివరించనున్నారు. అనంతరం బ్రహ్మశ్రీ మెట్ల పట్టాభి రామయ్య గురువు మార్గదర్శకత్వంలో భగవద్గీత శ్లోకాల సామూహిక పఠనం నిర్వహించబడుతుంది. ఈ సత్సంగంలో పాల్గొ నుట ద్వారా ఆధ్యాత్మిక శాంతి, జ్ఞానప్రాప్తి కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
● జిల్లా వ్యవసాయ అధికారి
మట్టా సుబ్రమణ్యేశ్వర్ రావు
కడప అగ్రికల్చర్: జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అనుబంధశాఖల సమన్వయమే కీలకం అని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు సూచించారు. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి, మెరుగైన దిగుబడులు సాధించే విధంగా అవగాహన కల్పించా లని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయిలో ప్రకృతి వ్యవసాయంపై అనుబంధ శాఖల అధికారులకు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎస్‌వీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై అన్ని శాఖల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రైతుల వద్దకు సమర్థవంతంగా తీసుకెళ్లాలని సూచించారు. మండలాల వారీగా పంటల సరళిని సిద్ధం చేసుకుని సంవత్సరాంతం ఏ పంటలు సాగు చేయాలో ప్రణాళికాబద్ధంగా రూపొందించాలని సూచించారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్‌వీ ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. డీడీఈ, ఏడీఏ, ఏఓ, హెచ్‌ఓ, ఏపీఏ, డీహెచ్‌ఓ, డీఎస్‌ఓ, ఆత్మపీడీ, డీఆర్‌డీఏ పీడీ, ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.


