కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగర శివార్లలోని వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 18 వరకు సీనియర్స్ మెన్ టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. మ్యాచ్‌లు ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయని పేర్కొన్నారు. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జట్లు తలపడతాయని వివరించారు.
కడప అర్బన్: కడప సబ్‌డివిజనల్ అధికారి ఏ.వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు పడింది. ఇటీవల కడపలో జరుగుతున్న పరిణామాల నేపద్యంలో డీఎస్పీ పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా ప్రస్తుతం మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న ఈ. బాలస్వామిరెడ్డిని నియమించినట్లు తెలిసింది.
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు పూర్వ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు, సమాన హాదాల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం సవరించబడిన తాత్కాలిక సీనియారిటీ జాబితా కార్యాలయ అధికారిక వెబ్ సైట్ https://rjdsekadapa.blogspot.comలో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కాగిత శ్యాముల్ తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు తమ సర్వీసు వివరాలు, సినియారిటీ స్థానాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. తమ సర్వీస్ వివరాలు లేదా సీనియాటికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధార పత్రాలతో rjdsekadapa@apschool edu.inద్వారా ఈ నెల 11వ తేదీ లోగా సమర్పించాలని పాఠశాల విద్య ఆర్‌జేడీ తెలిపారు.
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని జర్నలిస్టులకు ఈ నెల 8, 9 తేదీలలో కడప సర్వజన ఆసుపత్రి సౌజన్యంతో రిమ్స్‌లోని క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్‌ల ఆరోగ్య భద్రతకు పెద్ద పేట వేస్తోందని, ఇందులో భాగంగా సర్వజన ఆసుపత్రి ( రిమ్స్) లో జర్నలిస్ట్‌లు, తమ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వివరించారు. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని, వైద్య పరీక్షలకు హాజరయ్యే వారు రిజిస్ట్రేషన్ ఫారం లింక్‌లో పాత్రికేయులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్ట్‌లు ఈ సౌకర్యంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రక్త పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం, ఖాళీ కడుపుతో రావాలని, అలాగే గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్ట్ ఏవైనా ఉంటే వాటిని తీసుకురావాలని సూచించారు.
జమ్మలమడుగు: పర్యాటక కేంద్రమైన గండికోటలో మరోసారి చిరుతపులుల కలకలం మొదలైంది. మంగళవారం రెండు చిరుత పులులు నాలుగు గొర్రెలపై దాడి చేసి చంపడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంత కాలం కిందట చిరుత పులుల సంచారం ఉండటంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బయటకి వెళ్లాలన్న భయంతో అల్లాడిపోయారు. దీంతో ఫారెస్టు అధికారులు రంగంలోకి దిగి బోను పెట్టి చిరుతను పట్టుకుని తిరు పతి జూ పార్కుకు తరలించారు. ఇటీవల జమ్మలమడుగు–ముద్దనూరు రహదారిలో, అలాగే ముద్దనూరు– తాడిపత్రి రహదారిలో ఉన్న గాలేరు–నగరివరద కాలువపైన ఆటో డ్రైవర్లు వాహనదారులు చిరుతలను చూసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం గండికోటలో చిరుత పులులు 4 గొర్రెల పై దాడి చేసి చంపేయడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. గండికోటలో చిరుత పులులు సంచారం అని ప్రచారం జరుగుతుండటంతో పర్యాటకులు సైతం భయాందోళన చెందుతున్నారు


