కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్థిక హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సహేతుకం కాదని, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఫ్యాప్టో కడపజిల్లా చైర్మన్ సంగమేశ్వరరెడ్డి, సెక్రటరీ జనరల్ అబ్దుల్లాలు హెచ్చరించారు. ఫ్యాప్టో ఇచ్చిన మలిదశ పోరాట ఉద్యమంలో భాగంగా సోమవారం కడపలోని మున్సిపల్ మెయిన్ స్కూల్ పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యేలా చైతన్య పరిచారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు సకాలంలో 12వ పీఆర్సి అమలు చేస్తానని, 11వ పీఆర్‌సీలో జరిగిన నష్టాన్ని సవరిస్తామని, 12వ పీఆర్సీ కమిటీ వచ్చే లోపు జరిగే ఆలస్యానికి భర్తీగా మధ్యంతర భృతిని ప్రకటిస్తామని అన్నారన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల రోడ్డు మ్యాప్ ప్రకటించి విడుదల చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అలాగే కారుణ్య నియామకాల విషయంలో ఉపాధ్యాయుల పిల్లలకు జిల్లా యూనిట్‌గా నియామకాలు చేపడతామని, ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కూటమి పాలకులు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి అతీగతి లేదన్నారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన మలి దశ ఉద్యమంలో భాగంగా 9వ తేదీ సాయంత్రం మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 25 నుంచి 27 తేదీల మధ్యలో విజయవాడలో చేపట్టే రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున కడప జిల్లా నుంచి పాల్గొంటామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం నుంచి వెంకట సుబ్బారెడ్డి, చంద్రశేఖర్, ఎస్టీయు నుంచి ఇలియాస్‌బాషా, పాలకొండయ్య, రామ్మోహన్, ఏపీటీఎఫ్ నుంచి ఖాదర్ భాషా, శ్రీనివాస్ రెడి, యుటిఎఫ్, రూటా, బి టి ఏ,ఆఫ్టా అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో కడపజిల్లా చైర్మన్ సంగమేశ్వర్ రెడ్డి


