అమరావతి పేరిట దేశంలో అతిపెద్ద స్కాం | - | Sakshi
Sakshi News home page

అమరావతి పేరిట దేశంలో అతిపెద్ద స్కాం

Apr 6 2026 8:06 AM | Updated on Apr 6 2026 8:06 AM

కడప కార్పొరేషన్‌ : అమరావతి రాజధాని పేరిట దేశంలో అతిపెద్ద స్కాం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగార్జునరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ఏదైనా సాధిస్తేనో, గొప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తేనో సంబరాలు చేసుకుంటారని, కానీ అవేమీ లేకుండానే టీడీపీ శ్రేణులు అమరావతి పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. 12 ఏళ్లుగా గ్రాఫిక్స్‌లోనే చూపుతున్నారని, కనీసం టీజర్‌ అయినా వదలాలని ఎద్దేవా చేశారు. దేవతల రాజధాని అంటూ పైకెత్తుతున్నారని, శివుని కై లాసం కడుతున్నారో, శ్రీక్రిష్ణుని ద్వారకా నగరం నిర్మిస్తున్నారో అర్థం కాలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుని ప్రజలకు అన్యాయం చేశారన్నారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని శివరామక్రిష్ణన్‌ కమిటీ ఆనాడే చెప్పిందని, చదరపు అడుగుకు రూ.4500లతో అన్ని చోట్లా నిర్మాణాలు జరుగుతుంటే, అమరావతిలో మాత్రం రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. ఫ్లై ఓవర్‌నిర్మాణానికి కి.మీకి రూ.30 కోట్లు ఖర్చవుతుందని, వీరు మాత్రం రూ.175 కోట్లు వినియోగిస్తున్నారన్నారు. అమరావతి అనేది ఒట్టి భ్రమరావతి మాత్రమేనని, మావిగన్‌ పేరిట వైఎస్‌ జగన్‌ గొప్ప ఆచరణాత్మక ఆలోచన చేశారన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, కూటమి నేతలు చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికే తాము వ్యతిరేకమన్నారు. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలను అడుక్కుతినేలా చేస్తున్నారన్నారు. అమరావతి 40 ఏళ్లకు కూడా పూర్తి కాదన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన నాయకుడు చల్లా పవన్‌ మాట్లాడుతూ కూటమి నేతలు మంచం, మల్లెపూలు, విడాకులు అనే కాన్సెప్ట్‌తో పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ నాయుడు, అరవ శ్రీధర్‌ లాంటి వారి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. అనంతరం అమరావతి నిర్మాణం పేరుతో ప్రజలను అడుక్కుతినేలా చేస్తున్నారంటూ రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement