రాజుపాళెం : రాజుపాళెం మండల పరిధిలోని వెలవలి–తొండలదిన్నె గ్రామాల మధ్యలో మినీ స్కూల్ బస్సు – బైక్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎల్లప్పగారి పెద్ద ఖాదరయ్య (39) ఓ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం మండల కేంద్రమైన రాజుపాళెం నుంచి స్వగ్రామమైన వెలవలి గ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా మినీ స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు ఎడమ చేయి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాదరయ్య ఆదివారం మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. మృతుని తండ్రి రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన వ్యక్తి ..
బ్రహ్మంగారిమఠం : మండలంలోని మైదుకూరు– పోరుమామిళ్ల జాతీయ రహదారి లింగాలదిన్నెపల్లె సమీపంలో శనివారం జరిగిన బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన భోరెడ్డి జయనరసింహరెడ్డి(36) ఆదివారం మృతి చెందాడు. జయనరసింహరెడ్డికి . భార్య, ఇద్దరు గపిల్లలు ఉన్నారు. కడపలో ప్రవేటు ఆసుపత్రిలో కోమాలో ఉండి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చికిత్స పొందుతూ..
కమలాపురం : పట్టణ పరిధిలోని రైల్వే గేటు సమీపంలోని మందిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పన్నీరు సంకిత్(29) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి మందిరం వద్ద ఆర్‌ఓబీ కోసం ఏర్పాటు చేసిన చేసిన ఫైలింగ్ మిషన్‌ను తప్పించడంలో రెండు బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సంకిత్‌కి తీవ్ర గాయాలయ్యాయి. కమలాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్సలు అందించి మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కడప మృత్యుంజయ కుంటలో నివాసం ఉంటున్నాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు అన్నారు.


