‘సర్‌’ సర్వే చాలా ప్రమాదకారి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ సర్వే చాలా ప్రమాదకారి

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష

కడప కార్పొరేషన్‌ : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) సర్వేతో చాలా ప్రమాదం పొంచి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగర పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించారని, ప్రక్కనున్న తమిళనాడులో 93లక్షల ఓట్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి భరించలేక ఉత్తరప్రదేశ్‌లో 7 మంది బీఎల్‌ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. డబుల్‌ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారన్నారు. ఈనెల 15వ తేది నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశముందని, లేదా కొంత జాప్యం జరగవచ్చన్నారు. ఉద్యోగ నిమిత్తం వేరే చోట ఉన్నవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా జరగాలంటే సమర్థులైన వారిని బీఎల్‌ఏలుగా నియమించుకోవాలన్నారు. బీఎల్‌ఓలతోపాటు వైఎస్సార్‌సీపీ నియమించిన బీఎల్‌ఏలు కూడా ఈ వెరిఫికేషన్‌లో పాల్గొంటే ఉపయోగముంటుందని తెలిపారు. దీనిపై నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీఎల్‌ఏలు నిర్లక్ష్యంగా ఉంటే మనం నష్టపోయే అవకాశముంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పి. జయచంద్రారెడ్డి, బసవరాజు, బీహెచ్‌ ఇలియాస్‌, జమాల్‌వలీ, నాగమల్లారెడ్డి, అలీ అక్బర్‌, సుబ్బరాయుడు, నాగేంద్రప్రసాద్‌, శ్రీరంజన్‌రెడ్డి, అరీఫుల్లా బాష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement