● వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి ఆమెకు లేదు
● వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ
కడప కార్పొరేషన్ : రాష్ట్ర హోంమంత్రి అనిత నోటిని అదుపులో పెట్టుకొని సభ్యతగా మాట్లాడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ హెచ్చరించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు వచ్చాయని పదే పదే ఎద్దేవా చేస్తున్నారని, 40 శాతం ఓట్లు వచ్చాయని గుర్తించకపోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కేవలం 11 సీట్లు ఉన్న వైఎస్ జగన్‌కు మీరెందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతగాక లక్షల కోట్ల అప్పులు చేస్తూ ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలు, చిన్నారులు, దళితులపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. హోంమంత్రిగా వాటిని నియంత్రించాల్సిన అనిత ఆ పని చేయకుండా వైఎస్ జగన్‌ను విమర్శిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. రైల్వేకోడూరులో నడిరోడ్డుపై మహిళపై దాడి చేస్తే ఎలాంటి చర్యలు లేవని, సాక్షాత్తు అసెంబ్లీ స్పీకరే దళితున్ని కొట్టారని, జిల్లా ఎస్పీ కార్యాలయానికి వె ళ్లి టీడీపీ ఎమ్మెల్యే బెదిరించి, హంగామా చేస్తే వారిపై ఏం చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతటి అరాచకాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించరని, వైఎస్ జగన్‌ను విమర్శించి చంద్రబాబు, లోకేష్‌ల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లకే ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రత్నకుమారి, క్రిష్ణవేణి, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు బి. మరియలు, మల్లీశ్వరి, శివమ్మ పాల్గొన్నారు.


