ప్రొద్దుటూరు కల్చరల్ : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి కుటుంబ సభ్యులంతా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తారని రాయలసీమ వ్యాయామ విద్య కళాశాల కరస్పాండెంట్ ఉమ, ఎంవీఆర్ కుమారుడు మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం డాక్టర్ ఎంవీ రమణారెడ్డి 83వ జయంతి సందర్భంగా ఆర్‌సీపీఈలో ఎంవీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంవీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా గత రెండు రోజుల నుంచి కళాశాలలో రక్తవర్గ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. శనివారం సురక్ష బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 64 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. డాక్టర్ ఎంవీఆర్ ట్రస్టు ద్వారా విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవిశంకర్, అధ్యాపకులు, ఏఓ సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు డాక్టర్ టీడీ వరుణ్‌కుమార్‌రెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, సురక్ష బ్లడ్ బ్యాంక్‌నిర్వాహకుడు ఓబుళరెడ్డి, శ్రీసాయి డైగ్నోస్టిక్ సభ్యులు పాల్గొన్నారు.


