● హర్షవీణకు న్యాయం చేయాలి
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసిపాటి కిశోర్
కడప కార్పొరేషన్: రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి చేసిన జనసేన రౌడీ మూకలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని హర్షవీణ వీడియోలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం ఆమెకు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. జనసేన కార్యాలయం ఎదుట తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెప్పినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు. కనీసం ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదన్నారు. నిన్న గురువారం హర్ష వీణపై జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో రౌడీ మూకలు ఆమెను కులం పేరుతో దూషిస్తూ, రాడ్లతో దాడి చేసి హత్యాప్రయత్నం చేశారన్నారు. తాతంశెట్టి నాగేంద్ర పై హత్యాయత్నం, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై ఒక మహిళపై దాడి చేసినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమన్నారు. హర్షవీణకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, ఆమెకు జరుగుతున్న అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎలాంటి అండదండలు లేక ఒంటరిగా న్యాయపోరాటం చేస్తున్న ఆమెకు న్యాయం జరిగేంత వరక వైఎస్సార్‌సీపీ ఆమె పక్షాన పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.


