బద్వేలు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదలకు ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకంపై నీటినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్‌జీవోకాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయని, దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ అనగానే పేదలకు దివంగత మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పేరు గుర్తుకు వస్తుందని, అందుకు ఆయన పేరు ప్రజల గుండెల్లో నుండి దూరం చేసేందుకే కక్షపూరితంగా బిల్లులు చెల్లించకుండా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, యోగాడే వంటి వాటి కోసం వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన కూటమి పెద్దలకు పేదల ఆరోగ్యానికి ఆసరాగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకానికి బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. 2014–19 మధ్యకాలంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పెట్టారని, అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం వైద్య ఖర్చులు రూ.25 లక్షలకు పెంచడంతో పాటు పథకాన్ని మరింత విస్తరించి 3250 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి దిగిన కారణంగా పేద రోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పేదల ఆరోగ్యానికి ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి బిల్లులు చెల్లించి పథకాన్ని పూర్తిస్థాయిలో కొనసాగించాలని కోరారు.
ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ


