కడప ఎడ్యుకేషన్: పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు పొడగించినట్లు కడప మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4వ తేదీ వరకు గడువు ఇచ్చిన అధికారులు విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 9వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిలిపి ఉన్న పాలవ్యాన్‌ను ఢీకొని వ్యక్తి మృతి
రాయచోటి: రోడ్డుపై నిలిపి ఉన్న పాలవ్యానును ఢీకొని బత్తల శ్రీనివాసులు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. రాయచోటి పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్డులో ఉన్న ఎస్‌ఆర్ కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప పట్టణం అలంకాన్‌పల్లికి చెందిన బత్తల చంద్రయ్య కుమారుడు శ్రీనివాసులు రాయచోటిలోని పీటీఎంపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. శుక్రవారం బంధువుల ఇంటి నుంచి బైకుపై బయలుదేరిన శ్రీనివాసులు చిత్తూరు మార్గంవైపు వెళ్తుండగా పాల విక్రయానికి నిలిపి ఉన్న వ్యాన్‌ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఆటో డ్రైవర్ మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రింగురోడ్డులోని చిన్నశెట్టిపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో ఆటో డ్రైవర్ గుండ్ల సుబ్రమణ్యం (60) మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ప్రొద్దుటూరు వైపు నుంచి టాటా నెక్సెన్ కారు జమ్మలమడుగు వైపు వెళ్తుండగా చౌటపల్లె వైఎస్సార్ సర్కిల్ నుంచి వస్తున్న ఆటో చిన్నశెట్టిపల్లె క్రాస్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ సుబ్రమణ్యం అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


