అభినవ రామదాసు.. మన వాసుదాసు !
ఆశయ సాధనకు జీవితాన్నే అంకితం చేసిన ఘనత.. సాహితీ రంగంలో శిఖర సమానమైన కీర్తి.. మానవతా విలువలు.. ఆధ్యాత్మిక భావాలతో సమాజంలో నైతికతను పెంపొందించేందుకు కృషి చేసి.. కోదండ రామాలయం అభివృద్ధే పరమావదిగా జీవించి ఆంధ్రావాల్మీకిగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు వావిలికొలను సుబ్బారావు. అలతి పదాలతో అపురూపమైన కావ్యాలు రచించారు. తన ఆస్తినంతా ధారపోయడంతోపాటు చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి కోదండ రాముడి ఆలయ జీర్ణోద్దరణకు పాటు పడిన వాసుదాసు రామభక్తులకు ఆదర్శంగా నిలిచారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
● కోదండ రామాలయం అభివృద్ధికి కృషి
● యావదాస్తి జగదభిరాముడికే అంకితం
● వాసుదాసుకు వేదన తీరేనా!
● నేడు వావిలికొలను సుబ్బారావు జయంతి
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్దరణ కోసం కంకణం కట్టుకుని జీవితాంతం కృషి చేసిన వాసుదాసు 1863 జనవరి 23న మాఘ శుద్ధ చవితి నాడు జమ్మలమడుగులో జన్మించారు. భరద్వాజ గోత్రికులైన తల్లిదండ్రులు కనకమ్మ, రామచంద్రరావుకు ఈయన ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరి సొంతూరు కడప నగరం మోచంపేట. ఏడేళ్ల వయసు దాకా నోట మాట రాలేదు. బాల్యం శ్వాసకోశ వ్యాధితో బాధపడ్డారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక తొలుత ప్రొద్దుటూరులో రాబడి శాఖలో ఉద్యోగిగా విధుల్లోకి చేరారు. ఆ తరువాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్రోపాధ్యాయుడిగా అవకాశం వచ్చింది. సంస్కృతాంధ్ర భాషలో అమోఘమైన పాండిత్యం సంపాదించారు. ఆశు చిత్రబంధకృత్యాలు చెప్పే సామర్థ్యం సాధించారు.
రచనా సేద్యం..
ఆర్యనీతి, ఆర్య చరిత్ర రత్నావళి, హిత చర్య గ్రంథాలను రచించారు. విద్యార్థులకు సులభ వ్యాకరణం చేశారు. సుభద్ర విజయం అనే నాటకం రాశారు. భగవద్గీతను ద్విపదగా అనువదించారు. 1908 నాటికి వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. 1908 అక్టోబరు 9,10,11 తేదీల్లో ఒంటిమిట్టలో గొప్ప సాహితీ సభలు నిర్వహించారు. తాను రచించిన రామాయణాన్ని జగదభిరాముడికి అంకితం చేశారు. ఆ సభలోనే పండితులు ఆయన్ని ‘ఆంధ్రా వాల్మీకి’ అని శ్లాఘించారు. బమ్మెర పోతన ఒంటిమిట్ట వాసి అని గట్టిగా వాణి వినిపించారు. పోతన నికేతన చర్చ అనే గ్రంథాన్ని రచించారు. ఇంకా శ్రీకుమారాభ్యుదయం, ప్రౌఢప్రబంధం, రంగనాయకమ్మ శతకం, కౌసల్యా పరిణయం రచనలు చేశారు.
టెంకాయ చిప్ప చేతబూని..
శ్రీ రామచంద్రమూర్తిపై భక్తిభావంతో ఒంటిమిట్ట కోదండ రామాలయం జీర్ణోద్దరణ కోసం టెంకాయ చిప్ప చేతబూని భిక్షాటన చేసి విరాళాలు సేకరించారు. 1922 నుంచి 1927 వరకు రామాలయం అభ్యున్నతి కోసం పాటు పడ్డారు. తాను సమీకరించిన ధనంతో రామయ్య క్షేత్రాన్ని పునరుద్దరించారు. మహాద్వారం తలుపులకు మరమ్మతులు, సంజీవరాయస్వామి ఆలయ పునర్నిర్మాణం, శ్రీరామకుటీరం, విమాన గోపురం, గర్భాలయం, అంతరాలయం బాగు, నూతన రథశాల నిర్మాణం, రామతీర్థం జీర్ణోద్దరణ, శృంగిశైలి మీద వాల్మీకి ఆశ్రమం, ఇమాంబేగ్ బావికి మరమ్మతులు చేయించారు. 1925లో సీతారాముల కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. రామయ్యకు 108 బంగారు కాసుల మాల, నూటెనిమిది మంగళ సూత్రాల హారం, ఉత్సవమూర్తులకు కనకమయ కిరీటాలు, మరికొన్ని ఆభరణాలు, వెండితో పూజా సామగ్రి, వెయ్యిమందికి పరిపడ వంట చేసేందుకు పాత్రలు చేయించారు. భిక్షాటన చేసి సేకరించిన ధనం, శిష్యులు గురుదక్షిణగా సమర్పించిన నగదును, స్వీయ రచనలపై వచ్చిన సంపాదన, యావదాస్తిని రామయ్య సేవకే అంకితం చేశారు. ఒంటిమిట్ట, కడప, మద్రాసులో ప్రత్యేక భవనాలను సమకూర్చి పెట్టిన ఆయన 1936 జూలై 1న ఈ లోకం విడిచి వెళ్లారు.
నేటి కార్యక్రమాలు
ఆంధ్రావాల్మీకి వావిలికొలను సుబ్బారావు జయంతి సందర్భంగా నేడు(బుధవారం) ఉదయం శృంగిశైలం(సుబ్బారావు బోటు)పై ఉన్న తపో మందిరంలో జయంతి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
రాచమార్గానికి నోచుకోని శృంగిశైలం
ఆంధ్రా వాల్మీకి తపో మందిరం
అభినవ రామదాసు.. మన వాసుదాసు !
అభినవ రామదాసు.. మన వాసుదాసు !


