శంకుస్థాపన చోటే శ్మశాన వాటిక నిర్మాణం
ఖాజీపేట : ‘శ్మశాన వాటిక పనుల్లో నీచ రాజకీయం’అనే సాక్షి కథనంపై మండలంలోని టీడీపీ నాయకులు స్పందించారు. ఈ కథనంపై ఏపీ గ్రంథాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మిరెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు రెడ్యం రవీంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శంకుస్థాపన చేసిన చోటనే శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతుందని అన్నారు. 7.15 సెంట్ల స్థలంలోనే పనులు జరుగుతాయని అన్నారు. వంక పరంబోకు స్థలం ఆక్రమించుకున్న మాట వాస్తవం అన్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాదని, అన్ని పార్టీల వారు ఆక్రమించి సాగు చేశారని అన్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వేరొక చోటికి మార్చిన విషయం అవాస్తవం అన్నారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన చోటే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 40 ఏళ్లుగా శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్న బీసీ కాలనీ వాసులకు ఎమ్మెల్యే కృషితోనే నేడు వారి కల నెరవేరడంతో స్థానికులు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే బీసీ కాలనీ వాసులు వంక దాటుకునేందుకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కోటి రూపాయలతో బ్రిడ్జి ఏర్పాటు సైతం జరగుతుందని అన్నారు. పనులు చేయడంలో ఆలస్యం జరుగుతుందేమో కానీ పనులు మాత్రం పూర్తి చేసి శ్మశాన వాటిక నిర్మాణం చేసి తీరుతామని అన్నారు.
శంకుస్థాపన చోటే శ్మశాన వాటిక నిర్మాణం


