ఎస్సీ, ఎస్టీ కేసులో ఐదేళ్లు జైలు శిక్ష
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసులో కొప్పొల్ల వెంకటేష్(37)కు ఐదేళ్లు జైలు శిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ కడప ఎస్‌సీ,ఎస్‌టీ 4వ ఎ.డి.జె కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారని ఎర్రగుంట్ల సీఐ విశ్వనాఽథరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఎర్రగుంట్ల పరిధిలో ఉండే గమతం పెద్దనరసింహులు అనే వ్యక్తి ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 2019 మార్చి 31న సాయంత్రం ఎర్రగుంట్ల పట్టణంలోని ఎస్‌వీ మద్యం దుకాణం వద్ద నుంచి పెద్దనరసింహులు తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. పట్టణంలోని వేంపల్లి రోడ్డు పాలపుల్లమ్మ వీధికి చెందిన కొప్పొల్ల వెంకటేష్ అనే వ్యక్తి ఆటో వద్దకు వచ్చి పెద్దనరసింహులును కూలం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ సంఘటనపై బాధితుడు ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడు ఏఎస్‌ఐ శ్రీనివాసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్.సుధాకర్ విచారణ చేసి కొప్పొల్ల వెంకటేష్‌ను అరెస్టు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు న్యాయమూర్తి జీ దీనబాబు విచారణ చేశారు. కొప్పోల్ల వెంకటేష్ నేరం చేసినట్లు నిరూపణ కావడంతో అతడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ తెలిపారు.
జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున సమర్థవంతంగా వాదనలు వినివపించిన స్పెషల్ పీపీ ఎల్.బాలాజీ, అప్పటి డీఎస్పీ ఎన్.సుధాకర్, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి నిందితుడికి శిక్ష పడడానికి కృషి చేసిన ప్రస్తుత జమ్మలమడుగు డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు, యర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి, కోర్టు కానిస్టేబుళ్లు ఎం. సుబ్బరాయుడు, వెంకటేశ్వరరెడ్డి, హోంగార్డు పుష్పరాజ్‌ను జిల్లా ఎస్పీ షేల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.


