పోక్సో కోర్టు సంచలన తీర్పు
వల్లూరు (చెన్నూరు) : కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో 2017లో మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడి, మోసం చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముద్దాయికి జీవిత ఖైదుతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ కడప పోక్సో కోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ మంగళవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా వున్నాయి. దువ్వూరు మండల పరిధిలోని దాసరిపల్లె గ్రామానికి చెందిన ఏల్చూరి వెంకటరమణ చెన్నూరు మండల పరిధిలోని శాటిలైట్ సిటీకి చెందిన మైనర్ బాలికతో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో ఆమె వెంట పడేవాడు. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. తర్వాత బాధితురాలు పెళ్లి విషయమై అతన్ని ప్రశ్నించగా నిరాకరించాడు. పెళ్లి చేసుకోను, నీవు ఏమైనా ఫరవాలేదు అనడంతో మనస్తాపం చెందిన ఆమె అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడపలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన మరణానికి వెంకటరమణ కారణమని జడ్జి వద్ద మరణ వాంగ్మూలం ఇచ్చి 10 రోజుల తరువాత కోలుకోలేక మృతి చెందింది. ఆమె వాంగ్మూలం మేరకు చెన్నూరు పోలీస్‌స్టేషన్ అప్పటి ఎస్‌ఐ పీ రవికుమార్ కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం అప్పటి కడప సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ షేక్ మాసూమ్ బాషా (ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ, విజయవాడ)కు అప్పగించారు. ఈ మేరకు డీఎస్పీ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఈ కేసు కడప పోక్సో కోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ ముందుకు విచారణకు వచ్చింది. ప్రస్తుత చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి సంబంధిత కోర్టు కానిస్టేబుల్‌లను సమన్వయ పరుస్తూ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ కొమ్మినేని వేణుగోపాల్ బాధితురాలి పక్షాన బలమైన వాదనలు వినిపించగా పోక్సో కోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ మంగళవారం ఈ కేసులోని నిందితుడు వెంకట రమణకు జీవిత ఖైదుతోపాటు రూ.4 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
జిల్లా ఎస్పీ అభినందనలు
సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి సాకా్‌ాష్ధరాలతో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారి, ప్రస్తుత విజయవాడ అడిషనల్ ఎస్‌పీ షేక్ మాసూమ్ బాషా, పర్యవేక్షించిన కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, స్పెషల్ పీపీ కొమ్మినేని వేణుగోపాల్, చెన్నూరు సీఐ ఎం.కృష్ణారెడ్డి, కోర్ట్ మానిటరింగ్ సెల్ ఏఎస్‌ఐ నాగేంద్ర, చెన్నూరు పీఎస్ కోర్టు హెడ్ కానిస్టేబుల్ శివయ్యను వైఎస్‌ఆర్ కడప జిల్లా ఎస్‌పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.
బాలికను మోసం చేసి ఆత్మహత్యకు
ప్రేరేపించిన కేసులో జీవిత ఖైదు


