పూత రాక.. మామిడీలా!
గతేడాది ధర లేక పతనం
సాక్షి అన్నమయ్య: మామిడి రైతుకు ఏటేటా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఓసారి ప్రకృతి విపత్తులు.. మరోసారి పాలకుల తీరుతో నష్టపోతూనే ఉన్నాడు. మామిడి పంటనే ప్రధాన ఆదాయ వనరుగా భావించి జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి రైతులు పెట్టుబడులు పెడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా రాయచోటితోపాటు పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో సుమారు 34,772 హెక్టార్లకు పైగా మామిడి పంట సాగులో ఉంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా నవంబరు, డిసెంబరు నెలల్లో వర్షాలు రావడంతో చెట్లు వాడుదశకు రాలేదు. ప్రస్తుతం కూడా మంచు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో పూత కనిపించడం లేదు. ఎక్కడో అరకొరగా కనిపిస్తోంది. ఒక్క ఖాదర్, లాల్ బహార్ రకానికి సంబంధించి మాత్రమే కొంత పూత కనిపిస్తుండగా, మిగతా మామిడి రకాలకు ఎక్కడా పూత కనిపించడం లేదు. కొన్నిచెట్లు ఇప్పుడు కూడా పూతకు బదులు లేత ఇగుర్లు వస్తున్నాయి. రానున్న ఫిబ్రవరిలోపు మిగతా రకాల చెట్లకు పూత రావాల్సి ఉంది. గతేడాది ధరలు లేక పతనమైన మామిడి రైతులకు పరిహారం రూపంలోనైనా సాయం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మామిడి రైతుకు సంబంధించి గతేడాది దిగుబడులు పర్వాలేదనిపించినా ధరలు లేక మామిడి రైతు పతనమయ్యాడు. మార్కెట్‌కు తీసుకు వెళ్లాలన్నా గిట్టుబాటు కాకపోవడంతో చెట్లమీదనే వదిలేసిన పరిస్థితి. కొంతమంది రైతులకు సంబంధించి కాయలు చిత్తూరులోని గుజ్జు పరిశ్రమలకు తీసుకెళ్లినా ఆసక్తి చూపకపోవడంతో రోజుల తరబడి రైతన్నలు అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
తియ్యటి ఫలాలు పండించి.. తీపి లాభాలు గడించాలని ఆశ పడుతున్న మామిడి రైతుపై మంచు ముంచేలా ఉంది. నిలువెత్తు చెట్టుకు ‘పూత’ దశలోనే అడ్డుపడుతూ రైతన్న పెట్టుబడిపై కోత పెట్టేలా కనిపిస్తోంది. గతేడాది పాలకుల తీరుతో నష్టపోయిన మామిడి రైతు.. ఈ సారి ప్రకృతి తీరుతో కలవరపడుతున్నారు.
మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరం
గత ఏడాది దిగుబడి వచ్చినా ధర లేక పతనం
ఈసారి కొన్నిచోట్ల పూత వచ్చినా మగ్గిపోతున్న వైనం


