శేష వాహన గోవిందా... శ్రీ సూర్య దేవ గోవిందా!
కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంలో ఊరేగారు. రాత్రి పెద్ద శేష వాహనంపై కొలువుదీరారు. టీటీడీ అధికారులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, అర్చకులు మయూరం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించగా, సాయంత్రం ఊంజల సేవ చేశారు. నాదస్వర విన్యాసాల మధ్య కళాకారుల భక్తికీర్తనలతో ఊంజల సేవ ఉల్లాసంగా సాగింది. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో టీటీడీ కళాకారుల అన్నమాచార్య కీర్తనలు, ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథగానం భక్తులను అలరించింది. ఊరేగింపులో మహిళా భక్తుల కోలాట బృందాలు ప్రధాన ఆకర్శణగా నిలిచాయి.
నేటి కార్యక్రమాలు: ఉదయం 9 నుంచి 10 గంటల వరకు స్వామి చిన్న శేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. సాయంత్రం ఊంజల సేవ, అనంతరం అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి. రాత్రి 8 నుంచి స్వామి, అమ్మవార్లు సింహ వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షిస్తారు.
సూర్య ప్రభ, పెద్ద శేష
వాహనాలపై దేవదేవుడు


