ఇస్తేమా విజయవంతానికి ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి దీనీ ఇజ్తెమా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ తెలిపారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో నిర్వహించే ఇస్తేమా కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం మంత్రులతోపాటు కలెక్టర్, ఎస్పీ, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ ఇది చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ కలిసి చేసుకునే అతి పెద్ద మైనార్టీ పండుగగా అభివర్ణించారు. అవసరమైన వసతులు, తాగునీరు, రోడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇస్తేమా కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పలు అంశాలను వివరించారు.


